‘వాట్ ద ఎఫ్…’లో ‘ఎఫ్’ అంటే ఏంటో ఈతరం పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా విడమరిచి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. అయితే… ‘గీత గోవిందం’ దర్శకుడు పరాశురామ్ ‘ఎఫ్’ అంటే ఫ్రస్ట్రేషన్ అనే అర్థం వచ్చేలా సినిమాలో పాట పెట్టామని చెప్పారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ఆయన దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నిర్మించిన సినిమా ‘గీత గోవిందం’. ఇందులో హీరో విజయ్ దేవరకొండ పాడిన పాట ‘వాట్ ద ఎఫ్’. శ్రీమణి రాసిన ఈ పాటపై విమర్శల జడివాన కురవడంతో లిరిక్స్ మార్చిన సంగతి తెలిసిందే.
ఈ రోజు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన దర్శకుడు పరుశురామ్ ఈ వివాదంపై స్పందించారు. “నాది క్లీన్ సినిమా. రేపు థియేటర్లలోకి వచ్చాక ప్రేక్షకులకు తెలుస్తుంది. మధ్యలో కాంట్రవర్సీలు ఎందుకు అని.. లిరిక్స్ చేంజ్ చేశాం. నిజానికి, సినిమాలో పాట అవ్వగానే కొంతమంది అమ్మాయిలు హీరో దగ్గరకు వచ్చి ‘ఎఫ్ అంటే ఏంటి?’ అని అడుగుతారు. హీరో ఫ్రస్ట్రేషన్ అంటాడు. ఇవన్నీ వివరించే ప్రయత్నం చేస్తే బోలెడు టైమ్ పడుతుంది. నేను పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాను. ఎందుకు వచ్చిన గొడవ అని లిరిక్స్ తీసేశామ్. ఈమధ్య యూత్ అందరూ వాట్సప్ ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో ‘వాట్ ద ఎఫ్…, బ్రో…” పదాలు వాడుతున్నారు. ఇంత వివాదం అవుతుందని అనుకోలేదు” అని దర్శకుడు చెప్పారు.
ఆడియోలో విజయ్ దేవరకొండ ప్రేక్షకులలో ఎవరైనా పాట పాడి పంపితే… ‘గీత గోవిందం’ చిత్ర బృందానికి నచ్చిన వాయిస్ ఎంపిక చేసి సినిమాలో పెడతామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు విపరీతమైన స్పందన లభించిందని దర్శకుడు తెలిపారు. ఆల్రెడీ 15 మందిని సెలెక్ట్ చేశారట. వారిలో ఒకరిని ఎంపిక చేసి సినిమాలో పాడిస్తామని స్పష్టం చేశారు.