గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో సెటిలైపోయిన దర్శకుడు పరశురామ్. ‘శ్రీరస్తు శుభమస్తు’తో గీతా ఆర్ట్స్‌కి, మరీ ముఖ్యంగా అల్లు శిరీష్ కీ ఓ హిట్టిచ్చాడు. శిరీష్ కెరీర్ ఓ గాడిన పడేలా చేశాడు. అందుకే పరశురామ్‌ని గీతా ఆర్ట్స్ వదులుకోలేకపోతోంది. ‘గీతా గోవిందం’తో మరో ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్.. ఇప్పుడు మరో సినిమా కూడా చేతిలో పెట్టేసింది. ఆ సినిమా బన్నీతోనే అనే టాక్ నడుస్తోంది. కానీ పరశురామ్ మాత్రం ‘కథ ఇంకా సెట్ అవ్వలేదు…’ అంటున్నాడు. ”బన్నీతో నాకు మంచి చనువు వుంది. ఇద్దరం కథల గురించి మాట్లాడుకుంటుంటాం. `గీతా గోవిందం` కథ తనకు ముందే తెలుసు. తనకు నచ్చిన తరవాతే ఈ సినిమా పట్టాలెక్కింది. బన్నీతో సినిమా చేయాలని నాకూ ఉంది. కానీ.. తనకు తగిన కథ దొరికినప్పుడే అది వీలవుతుంది. నా దగ్గరున్న కథల్లో బన్నీకి బాగా నప్పుతుందనుకున్నప్పుడే బన్నీకి కథ చెబుతా. ప్రస్తుతం మూడు లైన్లు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. వాటిపై ఇంకా కసరత్తు చేయాలి. చేశాకే.. హీరో ఎవరన్నది డిసైడ్ అవుతుంది” అంటున్నాడు పరశురామ్. ‘గీతా గోవిందం’ గనుక హిట్టయితే… బన్నీతో సినిమా చేసే ఛాన్స్ సుగమం అయినట్టే.