తమిళనాడు రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. తమిళ ప్రజలు ఆప్యాయంగా కలైంజ్ఞర్గా కరుణానిధి కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం.. అమ్మ జయలలిత … తిరిగిరాని లోకాలకు చేరగా… ఇప్పుడు కరుణ కూడా దూరమయ్యారు. జయలలిత వర్సెస్ కరుణానిధి అంటూ సాగిన రాజకీయాలు కూడా వీరితోనే ముగిసిపోయినట్లయ్యాయి. 94 ఏళ్ల కరుణానిధి.. కొద్ది రోజులుగా మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కావేరీ ఆస్పత్రిలోనే కన్నుమూశారు.
ఎం.కరుణానిధి బాల్యంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన తెలుగింటిబిడ్డ ముత్తవేల్ దక్షిణామూర్తి అలియాస్ కరుణానిధి. ఐదుమార్లు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆయన తనదైన శైలిలో పార్టీని ముందుకు నడిపిస్తూ అపర చాణుక్యుడిగా పేరుతెచ్చుకున్నారు. కార్యకర్తలతో కలైంజ్ఞర్ అని పిలిపించుకున్నారు. తిరువారూర్ జిల్లా తిరుక్కువనయిల్ గ్రామంలో 1923 జూన 3వ తేదీన జన్మించారు. తన 14వ ఏటనే జస్టిస్ పార్టీ నాయకుడు ఆళగిరిస్వామి ఉపన్యాస స్ఫూర్తితో స్థానిక యువకులతో కమిటీలను ఏర్పాటు చేసి హిందూ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో తమిళనాడు తమిళ మానవర్ సంఘం ఏర్పాటు చేసి ద్రావిడలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమాలు చేపట్టారు. ప్రాథమిక పాఠశాలతోనే విద్యాభ్యాసం ముగించినా 14వ ఏటనే జూపిటర్ చిత్రానికి స్ర్కిప్ట్ రైటర్ అవతారమెత్తారు. 21 ఏళ్లప్రాయంలో రాజకుమారి అనే చిత్రంతో పూర్తిస్థాయిలో రచయితగా మారి, 75 చిత్రాలకు పైగా మాటలందించారు.
కథలు, నవలలు, తమిళ కవిత్వం, చారిత్రక కావ్యాలు రచించి తమిళ భాషకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చారు. 1957లో కుళిత్తలై నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. డీఎంకే కోశాధికారిగా వ్యవహరించిన ఆయన 1961లో శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. 1962లో డీఎంకే అధికారంలోకి రావడంతో ప్రజాపనులశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 1969లో అన్నాదురై మరణానంతరం తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తన అధికారంలో పలు కీలక నిర్ణయాలు చేపట్టిన ఆయన దివంగత ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీతో పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. 1971లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టిన కరుణానిధి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ కేంద్రప్రభుత్వం రాష్టప్రభుత్వం డిస్మిస్ చేసింది.
అనంతరం 1989, 1996, 2006 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో కన్యాకుమారి సముద్రంలో 133 అడుగుల భారీ తిరువళ్లువర్ విగ్రహం ఏర్పాటైంది. 1957లో తొలిసారి ఎమ్మెల్యేగా కుళిత్తలై నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన తంజావూరు, సైదాపేట, అన్నానగర్, హార్బర్, చేపాక్, తిరువారూర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన పోటీచేసిన 13 సార్లు గెలుపొంది చరిత్ర సృష్టించారు. కరుణ మరణంతో భారత రాజకీయాల్లో ఓ మహానేత మహాభినిష్క్రమణం పూర్తయినట్లయింది.