ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. విశాఖ రైల్వేజోన్ విషయమై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనే సందిగ్దం సాయంత్రం వరకూ కొనసాగింది. ఎట్టకేలకు ఆయనతో సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు రావడంతో టీడీపీ నేతలకి తీవ్ర ఆగ్రహాం తెప్పించింది. పోనీ, వచ్చిన ఆయన కామ్ కూర్చుని.. ఇది టీడీపీ నేతలు తీసుకున్న అపాయింట్మెంట్ కదా, మధ్యలో తానెందుకు జోక్యం చేసుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడటంతో తెలుగుదేశం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
విశాఖ రైల్వే జోన్ అంశమై ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలంటూ తాము కేంద్రమంత్రిని కలిశామంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు అనంతరం మీడియాకు చెప్పారు. అయితే, మరోసారి అవమానకరంగా మాట్లాడారనీ, పాత రికార్డే మళ్లీ వినిపించారనీ, సంబంధిత అధికారులతో మాట్లాడతాం, చర్చిస్తామనే చెప్పారని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ సమావేశానికి జీవీఎల్ ను ఎందుకు రానిచ్చారంటూ మండిపడ్డారు. రైల్వేమంత్రితో తాము మాట్లాడుతుంటే, ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేయడమేంటని తప్పుబట్టారు. కనీసం పీయూష్ గోయల్ కూడా జీవీఎల్ ను వారించే ప్రయత్నం చెయ్యలేదనీ, ఆయనకి జీవీఎల్ తో వేరే సమావేశం ఉంటే తరువాత మాట్లాడుకోవచ్చుగానీ… ఏపీ నేతలకు ఇచ్చిన అపాయింట్మెంట్ మధ్యలో ఆయనెందుకు వచ్చారంటూ తాము అభ్యంతరం వ్యక్తం చేసి, జీవీఎల్ ను మాట్లాడనీయకుండా చేశామని చెప్పారు.
ఈ క్రమంలో జీవీఎల్ పై కళావెంకట్రావు తీవ్రంగా మండిపడ్డారు. రైల్వేజోన్ పై గోయల్ మాట్లాడుతున్న సమయంలో జీవీఎల్ జోక్యం చేసుకునేసరికి ఒక్కసారిగా టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. సమాధానం చెప్పడానికి ఆయనెవరంటూ ప్రశ్నించారు కళా. జీవీఎల్ తో కళా వెంకట్రావు వాగ్వాదానికి దిగారు. తాము మాట్లాడుతున్నదీ, సమస్యల గురించి చెప్పుకుంటున్నదీ జీవీఎల్ తో కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ సమయంలో భాజపా ఎంపీ హరిబాబు జోక్యం సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
నిజానికి, రైల్వేజోన్ విషయమై కేంద్రం నుంచి అనూహ్యమైన సమాధానం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచితే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనే ప్రయత్నాలు ఏపీ సర్కారు చేస్తూనే ఉంది. అయితే, ఈ మధ్య ప్రతీదానిలో ఈ జీవీఎల్ నర్సింహారావు జోక్యం చేసుకుంటూ ఉండటం కాస్త చిరాకు తెప్పించేదిగానే ఉందనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో మరింత పెరిగింది. మొన్నటికి మొన్న.. పి.డి. అకౌంట్లలో భారీ కుంభకోణం అంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ఇవాళ్ల రైల్వే జోన్ గురించి రైల్వే మంత్రి సమక్షంలో ఈయన మాట్లాడేసే ప్రయత్నం చేశారు. ఇంతకీ.. ఆయన తీరు చూస్తుంటే, ఇతర భాజపా నేతలే కాస్త నయమేమో అనిపిస్తోంది. ఏమీ చెయ్యం అనే సమాధానమైనా సామరస్యంగా ఇస్తున్నారు. కానీ, ఈ జీవీఎల్ మాత్రం… ఏంటో మరి..?