ఓ పక్క పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతుంటే… అడుగడుగునా అవినీతి జరుగుతోందనీ, కమిషన్ల కోసమే కడుతున్నారంటూ అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తుంటారు వైకాపా నేతలు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, పోలవరం విషయంలో ఎప్పటికప్పుడు వివిధ అంశాలపై జాప్యం చేస్తున్నా ఒక్కరోజైనా కేంద్రాన్ని ప్రశ్నించరు. కానీ, పోలవరం ప్రాజెక్టు క్రెడిట్ మాత్రం వైకాపాకి కావాలట..! అదేనండీ.. వైయస్సార్ హయాంలో జరిగిన పోలవరం ప్రాజెక్టు పనుల క్రెడిట్ వారసత్వం ప్రకారం తమకే దక్కుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారు వైకాపా నేతలు.
పోలవరం ప్రాజెక్టు వచ్చిందంటే కారణం గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవే అన్నారు వైకపా అధికార ప్రతినిధిని పార్థసారధి. ఆ మహానేత కుమారుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డికి పోలవరంపై మాట్లాడే హక్కు ఉందనీ, వేరెవ్వరికీ లేదని ఆయన తీర్మానించేశారు! గోదావరిలో నీరంతా సముద్రం పాలౌతుంటే, దాన్ని పంట పొలాలకు మళ్లించాలనే ఆలోచన దివంగత నేత వైయస్సార్ కు వచ్చిందనీ, ఆయన పుణ్యమే పోలవరం ప్రాజెక్టు అన్నారు. కానీ, టీడీపీ ప్రభుత్వం గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేస్తుందన్న నమ్మకం తమకు లేదనీ, ఒకవేళ అలా చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా సవాలు చేశారు. 2017లోగా ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆ తరువాత మాట మారుస్తూ మారుస్తూ ఇప్పుడు 2019కి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ విషయమై మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ… జగన్ పై కేసులు బనాయించారనీ, ఆయన చేస్తున్నది న్యాయ పోరాటమని చెప్పుకొచ్చారు.
వైయస్సార్ కుమారుడిగా జగన్ రాజకీయాల్లోకి వచ్చారు! కానీ, వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధికీ, ప్రస్తుతం వైకాపా అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికీ సంబంధం ఎలా..? తండ్రీ తనయుల రిలేషన్ వేరు! ఒకవేళ జగన్ కూడా కాంగ్రెస్ లో ఉండి ఉంటే, వైయస్ పాలన క్రెడిట్ కోసం పాకులాడితే అందులో కొంత అర్థం ఉండేది. జగన్ వేరే పార్టీ పెట్టుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ పాలనలో తమ గతాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. అది చాలదన్నప్పుడు.. ఇప్పుడు, పోలవరంపై మాట్లాడే హక్కు జగన్ కు మాత్రమే ఉందంటూ మాట్లాడటం వితండమే అవుతుంది! హక్కు ఉండటమేంటీ.. బాధ్యత అక్కర్లేదా..? ఆ బాధ్యత ఉంటే ఇలా మాట్లాడరు కదా! ప్రాజెక్టు పూర్తయ్యేందుకు తమవంతు చేయాల్సిన కృషి చేస్తారు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతారు. అవేవీ చెయ్యకుండా.. ఓపక్క పనులు జరుగుతుంటే, వీటిలో అవినీతి జరిగిపోయిందంటూ నిరాధార ఆరోపణలూ, పసలేని ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల గురించి ఇప్పుడు వైకాపా ప్రచారం చేసుకునే ప్రయత్నంలో పడింది! ఇంతకీ, పోలవరం ప్రాజెక్టుకీ వైకాపాకీ ఏంటి సంబంధం..?