క్రిష్ బహుముఖ ప్రజ్ఞాశాలి. కథకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా… తన సామర్థ్యాన్ని ఇప్పటికే చూపించేశాడు. కమర్షియల్ యాడ్లు తెరకెక్కించడంలోనూ క్రిష్ సిద్ధహస్తుడే. మరోవైపు బుల్లి తెరపైనా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈటీవీలో కొన్ని ధారవాహికల్ని నిర్మించాడు. ‘స్వాతి చినుకులు’ చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు మరో సీరియల్ నిర్మాణానికి రంగం సిద్ధం చేశాడు. ‘పల్లెటూరి పిల్ల’ అనే పేరుతో క్రిష్ ఓ టీవీ సీరియల్ తెరకెక్కిస్తున్నాడు. దీనికి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, కథని కూడా తనే అందిస్తున్నాడు. సినిమా నేపథ్యంలో సాగే సీరియల్ ఇది. ఓ పల్లెటూరి పిల్ల కథానాయికగా ఎలా ఎదిగిందన్నది ఇతివృత్తంగా నడుస్తుంది. ఓ వైపు మణికర్ణిక, ఎన్టీఆర్ లాంటి పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, మరోవైపు సీరియళ్లపైనా దృష్టి సారించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రస్తుత జనరేషన్‌లో దర్శకుడిగా కొనసాగిస్తూ, టీవీ సీరియళ్లని నిర్మిస్తోంది ఇతనొక్కడే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.