రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో గణాంకాలు అధికార ఎన్డీఏకు అనుకూలంగా మారుతున్నాయి. తమ సభ్యుడికి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు కాబట్టి.. తాము ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తామని అన్నాడీఏంకే ప్రకటించింది. అన్నాడీఎంకేకు 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇక బిజూ జనతాదళ్ కూడా.. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌కు మద్దకు ప్రకటించారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్.. స్వయంగా ఫోన్ చేయడంతో… మద్దతు ఇస్తానని నవీన్ పట్నాయక్ మాట ఇచ్చారు. బిజేడీకి 9 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఇక ఆరుగురు సభ్యులున్న టీఆర్ఎస్ ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించకపోయినా.. జేడీఎస్ అభ్యర్థికే మద్దతు పలకడం ఖాయం. ఇక శివసేన, జేడీఎస్ కూడా అమిత్ షా .. బుజ్జగించడంతో మెత్తబడ్డాయి. ఎన్డీఏ అభ్యర్థికే ఓటేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
ప్రస్తుతం రాజ్యసభలో 244 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి 126 మంది సభ్యుల మద్దతు ఉందని.. బీజేపీ ప్రకటించింది. వైసీపీ తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని చెబుతున్నా.. కమలం నేతలు ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. తమకే ఓటేస్తారని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. వారిని కూడా లెక్కలో వేసుకున్నారు. ఎన్నికకు వెళ్లడం కన్నా ఏకగ్రీవంగా జేడీయూ అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం మంచిదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కాంగ్రెస్‌కు ఉచిత సలహా ఇచ్చారు.
కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌కు నికరంగా 111 మంది సభ్యుల మద్దతు కనిపిస్తోంది. యూపీఏకి చెందిన 61 మంది, తృణమూల్‌కు 13 మంది, టీడీపీకి ఆరు, సీపీఎంకు ఐదుగురు, బీఎస్పీ, డీఎంకే నుంచి నలుగురు, సీపీఐ, జేడీఎస్, ఓ నామినేటెడ్ సభ్యుడు హరిప్రసాద్‌కు మద్దతిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన పీడీపీ గైర్హాజర్ అవుతున్నట్లు ప్రకటించింది. ఆమ్ఆద్మీ పార్టీ తన స్టాండ్ ఏమిటో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే.. ఎన్డీఏ గట్టెక్కడం సులువుగానే కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో లేని అన్నాడీఎంకే, బీజేడీ … బీజేపీ పరువు నిలబెట్టబోతున్నాయి. ఈ ఉదయం పదకొండు గంటలకు ఎన్నిక జరుగుతుంది.