ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వరాష్ట్రం గుజరాత్లో రూ. 4వేల కోట్ల పల్లీల స్కాం వెలుగు చూడటం సంచలనం సృష్టిస్తోంది. రైతులకు చెందిన రూ. 4వేల విలువైన వేరుశెనగ గింజలను అమ్ముకున్న బీజేపీ స్థానిక నేతలు, అధికారులు… వాటి స్థానంలో ఇసుక, మట్టి వేసి తగులు బెట్టేశారు. అగ్నిప్రమాదం జరిగిందని షో చేసి.. రైతుల నోట్లో బూడిద పోద్దామనుకున్నారు. కానీ విషయం బయటపడింది. ఇప్పటి వరకూ ఈ స్కాంమలో 27 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ప్రణాళికా బద్దంగా ఈ స్కామ్ జరిగింది.
గుజరాత్లో సౌరాష్ట్రలో వేరు శెనగను ఎక్కువగా పండిస్తారు. రైతుల వద్ద నుంచి ఈ పంటను నాఫెడ్ , గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సేకరిస్తుంది. అక్కడే అందుబాటులో ఉన్న గోడౌన్లను ఉంచుతుంది. కొన్ని ప్రభుత్వ గోడౌన్లు..మరికొన్ని ప్రైవేటు గోడౌన్లలో ఉంచుతారు. గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో బీజేపీ నేతల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. దాంతో నాఫెడ్ అధికారులు, గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు, బీజేపీ నేతలు కలసి.. రైతుల నుచి సేకరించి గోడౌన్లలో దాచిన వాటిని.. రహస్యంగా మిల్లర్లకు అమ్మేశారు. వాటి స్థానంలో ఇసుక, రాళ్లు పెట్టారు. ఆ తర్వాత గోడౌన్లలో ప్లాన్ ప్రకారం.. బుగ్గి చేయడం ప్రారంభించారు. ఆరు నెలల్లో నాలుగు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఆ నాలుగు గోడౌన్లలోని సరుకంతా తగలబడిపోయినట్లు రాసుకున్నారు.
చివరికి అగ్నిప్రమాదల విషయం అనుమానం రావడంతో.. వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. తీగ లాగితే డొంక అంతా బయటపడింది. రూ. 4వేల కోట్ల రైతుల వేరుశెనగనకు అధికారులతో కలిసి బీజేపీ నేతలు అమ్ముకున్నట్లు వెల్లడయింది. ఇప్పటికే అరెస్ట్ 27 మందిలో ఇరవై మంది వరకూ బీజేపీ నేతలే ఉన్నారు. ఈ స్కాం గుజరాత్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ నేతలు… తాము అందరికంటే.. నీతి మంతులమని చెబుతూంటారు. కానీ అసలు విషయం మాత్రం తేడాగా ఉంది. ఏపీ విషయంలో జీవీఎల్ లాంటి వాళ్లు చేస్తున్న విమర్శలకు.. గుజరాత్లో బయటపడిన స్కాం.. కౌంటర్ సమాధానంలా మారే పరిస్థితి వచ్చింది.