నోడల్ అధికారులతో ఏర్పాటైన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వారికి దిశానిర్దేశం చేశారు. దాదాపు గంటసేపు సీఎం ప్రసంగం సాగింది. ఈ సందర్భంగా చాలా అంశాలను ఆయన ప్రస్థావించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజల సంతోషాన్ని పెంచాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంపై సాక్షి కవరేజ్ ఎలా ఉందంటే… నోడల్ అధికారులకు సీఎం క్లాస్ తీసుకున్నారూ, అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారూ, ఒక్కరోజు కార్యక్రమానికి లక్షల రూపాయలు ఖర్చు చేశారు, నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు, ఇదంతా ఏదో వ్రుథా ఖర్చు అనే కోణంలో ప్రెజెంట్ చేశారు.
పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేసేది అధికారులే కాబట్టి.. ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచగలిగేది మీరే అంటూ సీఎం చెప్పారు. అంతేకాదు, ఒక్కో అధికారీ ఒక నాయకుడిలా వ్యవహరిస్తూ, కింది స్థాయివారితో కలిసి గ్రామాల్లో పర్యటించాలన్నారు. ప్రజల్లో సంతృప్తిని చూడాలన్నారు. అయితే, ఈ సందర్భంగా కొన్ని చోట్ల ప్రభుత్వ పథకాలు అందుతున్నా… అక్కడి అధికారుల తీరు వల్ల ప్రజల్లో కొంత అసంతృప్తి కలుగుతోందన్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలను నవ్వుతూ పలకరించాలనీ, వారితో కాసేపు కాస్త ప్రేమగా మాట్లాడితే చాలనీ… ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సీఎం చెప్పారు. అంతేకాదు, ఈ సందర్భంగా అధికారుల కృషి వల్ల సాధించిన విజయాలను గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కొన్ని ఉదాహరణలు కూడా ఈ సందర్భంగా ప్రస్థావించారు.
సాక్షిలో రాసినట్టుగా జనవరిలోపు సమస్యలన్నీ పరిష్కరించేయాలని హుకుం జారీ చెయ్యలేదు! ఇప్పుడున్న లక్ష్యాలను జనవరిలోకి అందుకోవాలనీ, జనవరి నాటికి గుర్తించిన సమస్యలపై అధ్యయనం చేసి… దాంతో ఐదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికను తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి…. ఇలా రాష్ట్రస్థాయి వరకూ ఒక విజన్ తయారు చేసుకునేందుకు వీలుగా అధికారులు కృషి చేయాలన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగం అంతా ఇలా అధికారుల్లో స్ఫూర్తి నింపే విధంగా, ఉత్సాన్ని నింపే విధంగా పాజిటివ్ మూడ్ లో సాగింది. ప్రజల్లో సంతృప్తిని చూడగలిగేది, వారిలోని ఆనందాన్ని పెంచగలిగేది క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రమే అని చాలా స్పష్టం చెప్పారు. కానీ, సాక్షి కథనం చూస్తుంటే… సంక్షేమ పథకాల అమలుకు ఉద్యోగుల వైఖరే అడ్డంకిగా ఉందని సీఎం క్లాస్ తీసుకున్నట్టు ప్రెజెంట్ చేశారు. వారిపై మండిపడేందుకే ఈ కార్యక్రమం పెట్టారన్నట్టుగా ఉంది. అంతేకాదు, ఇంత కీలకమైన సమావేశానికి లక్షల రూపాయాలు ఖర్చు అయిపోయాయంటూ సాక్షి వాపోవడం మరీ విడ్డూరం. రాష్ట్రస్థాయి సమావేశం, ముఖ్యమంత్రి పాల్గొన్న పాల్గొన్న సదస్సు… ఇలాంటివి నిర్వహించినా కూడా అదేదో అనవసర ఖర్చు అన్నట్టుగా దీన్లో కూడా విమర్శల కోణాన్ని వెతుక్కోవడానికి ఏ రకమైన జర్నలిజం అంటారు..?