రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. ఎవరికీ ఓటేయబోమని ప్రకటించింది. గైర్హాజరవుతున్నట్లు.. ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎన్నికకు కొద్ది సేపటి ముందు ప్రకటించారు. కొద్ది రోజులుగా బీజేపీ వ్యతిరేక పక్షానికి ఓటేస్తామని.. విజయసాయిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా మాట మార్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారనే కారణంగానే తాము ఓటు వేయడం లేదని చెప్పుకొచ్చారు. ఇతర పక్షాల అభ్యర్థిని నిలబెడతామని చెప్పారని.. ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే రంగంలోకి దించారని.. విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఏపీకి కాంగ్రెస్, బీజేపీ రెండూ అన్యాయం చేశాయని… అందుకే ఎవరికీ ఓటు వేయబోమన్నారు.
నిజానికి విజయసాయిరెడ్డి.. నిన్న సాయంత్రం కూడా… బీజేపీకి వ్యతిరేక పక్షానికే ఓటు వేస్తామని ప్రకటించారు. అప్పటికి కాంగ్రెస్ తరపున హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల సమయం కూడా గడిచిపోయింది. అంటే.. కాంగ్రెస్, జేడీయూ అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉంటారని క్లారిటీ వచ్చింది. అప్పటికి కూడా.. తాము బీజేపీ వ్యతిరేక పక్షానికే ఓటు వేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టంగా ప్రకటించారు. అంటే హరిప్రసాద్‌కు మద్దతిస్తామని నేరుగా చెప్పినట్లయింది. కానీ అనూహ్యంగా … తెల్లారే సరికి.. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయబోమనే కారణం చెబుతూ.. గైర్హాజర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. బీజేపీతో కుమ్మక్కయ్యారనే విస్తృత ప్రచారం జరుగుతండటంతో దాన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ… రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి కాకుండా.. బీజేపీ వ్యతిరేక పక్షానికి మద్దతిస్తామనే వాదన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీన్నే అడ్డు పెట్టుకుని కొద్ది రోజులుగా.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న ప్రచారం చేసుకున్నారు. కానీ చివరికి వచ్చే సరికి మళ్లీ బీజేపీకి అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నారు. ఓటింగ్‌కు గైర్హాజర్ అవడం వల్ల నేరుగా బీజేపీకే లాభం కలుగుతుంది. విపక్షాలకు చివరి క్షణంలో హ్యాండిచ్చి..వారిని మోసం చేశారు.