జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై కుల ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు. కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోరాటయాత్రను కొనసాగించేందుకు భీమవరం చేరుకున్నారు. వచ్చీ రాగానే ఆయన… బీసీ సంఘాల ప్రతినిధులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రాజకీయాలపై తన ఆలోచనలు.. తాను ప్రజలకు ఎలా మంచి చేయాలనుకుంటున్నానో వివరించారు.ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కులాల మధ్య విభజన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనం అంతా మనుషులుగా కలసి ఉన్నా… కులాలుగా విడిపోయామని నిర్వేదం వ్యక్తం చేసారు. కులాల ఐక్యత అనేది తన ఆశయమని.. బీసీ సంఘాల నేతలకు పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబాల చేతుల్లోనే ఉందన్నారు. వారి వల్ల ప్రజలకు ఉపయోగం లేదని… ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడ్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ తర్వాత బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతోనూ.. పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఎవరో కొంత మంది చేసిన తప్పులకు ఇప్పటి బ్రాహ్మణులను అనటం తప్పు అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను అధికారంల కోసం రాజకీయాల్లో రాలేదన్నారు. ఏదో ఒకటి చేసేసి అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తనకు అధికారం కంటే.. సమస్యలపై పోరాటమే ముఖ్యమన్నారు. సమస్యలపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. బ్రాహ్మణులకు బీమా అంశంపై మ్యానిఫెస్టోలో పెట్టేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. తాను ఎప్పుడూ కులాలను ఓటు బ్యాంక్ గా చూడనని హామీ ఇచ్చారు. వేదాల మీద, ఆచార వ్యవహారాల మీద నాకు గౌరవం ఉందని గుర్తు చేశారు.
రాజకీయ పార్టీ పెట్టడం చాలా కష్టమైన, ఖర్చుతో కూడిన పని అని.. గుండె ధైర్యంతో పార్టీ పెట్టానని చెబుతున్నారు. జనసేనపై ఓ సామాజికవర్గ ముద్ర పడకుండా పవన్ కల్యాణ్ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకోవాలనుకుంటున్నారు. పోరాటయాత్రలో కవాతులతో ఇక నుంచి నుంచి సమాజనంలో అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలతో సమావేశమై ఆలోచనలు పంచుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.