రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన బీకే హరిప్రసాద్ ఓటమిపాలయ్యారు. అయితే, ఈ ఓటమిని ఆ పార్టీ అధ్యక్షుడి ప్రయత్న లోపంగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తూ ఉండటం విశేషం! పార్లమెంటు గత సమావేశాల్లో మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు రాహుల్ చురుకైన పాత్ర పోషించారుగానీ, ఇప్పుడు ఈ ఎన్నిక విషయానికి వచ్చేసరికి ఆయన కాస్త బద్ధకించేశారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాలతోపాటు, యుపీయేకి చెందిన కొన్ని పక్షాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి, కాంగ్రెస్ అభ్యర్థి ఘోరంగా ఓడిపోలేదుగానీ… రాహుల్ గాంధీ మరింత ప్రయత్నించి ఉంటే, పట్టున్న రాజ్యసభలో భాజపాపై పైచేయి సాధించినట్టయ్యేదన్నది కొంతమంది అభిప్రాయం.
కాంగ్రెస్ తరఫున ఒక అభ్యర్థిని బరిలోకి దించేసి చేతులు దులుపుకున్నారు. అంతేగానీ, తమకు మద్దతుగా ఓటెయ్యండంటూ రాహుల్ ఎవ్వరినీ స్వయంగా ఫోన్ చేసి కోరలేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. కనీసం ఎన్డీయేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీల విషయంలోనైనా రాహుల్ శ్రద్ధ కనబరచి, వాళ్లకి ఫోన్ చేసి ఉంటే బాగుండేదంటున్నారు! మోడీ అంటే ఒంటికాలిపై లేచే ఆమ్ ఆద్మీ పార్టీగానీ, తాజాగా కాశ్మీరులో భాజపా మద్దతు ఉపసంహరణతో అధికారం కోల్పోయిన పీడీపీ.. ఇలాంటి పార్టీలు సభకు డుమ్మా కొట్టాయి. ఇలాంటివారితో ముందుగా రాహుల్ మాట్లాడి ఉంటే, ఎన్డీయేతర పక్షాల మద్దతును కూడగట్టినట్టు అయ్యేది.
సరే, రాహుల్ కి అంత ఓపిక లేదనుకున్నప్పుడు… కాంగ్రెస్ కి బదులుగా యూపీయే మిత్రపక్షాలకు చెందిన ఎవర్నో ఒకర్ని అభ్యర్థిగా ఎంపిక చేసి, అవకాశం ఇచ్చినా బాగుండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇతర పక్షాల మద్దతు కూడగట్టుకోవడం, భాజపాయేతర పార్టీల ఓట్లు తమకు పడేలా ప్రయత్నాలు చేయడం… ఇలాంటి బాధ్యతలన్నీ కనీసం వారైనా సీరియస్ గా తీసుకునేవారు. భాజపా విషయమే తీసుకుంటే.. ప్రధానమంత్రి స్వయంగా నవీన్ పట్నాయక్ ఫోన్ చేశారు. వ్యూహాత్మకంగా కేసీఆర్ ను కూడా వయా నితీష్ కుమార్ ద్వారా దార్లోకి తెచ్చుకున్నారు. ఇంకోపక్క, వైకాపా లాంటి పార్టీలు గైర్హాజరై… భాజపాకి పరోక్షంగా మద్దతు ప్రకటించి, వ్యతిరేక ఓట్లను తగ్గించినట్టయింది.
భాజపా ఇంత ప్రయాసపడుతున్నప్పుడు… అవకాశం ఉన్న చోట కూడా రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారనే విమర్శ బలంగానే వినిపిస్తోంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేతర పక్షాలన్నీ కాంగ్రెస్ గొడుగు కిందికి తెచ్చుకునేందుకు రాహల్ గాంధీ సమర్థంగా ప్రయత్నించగలరా అనే అనుమానం మరింత బలపడేలా చేశారు. మొత్తానికి, రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిని ప్రతిపక్షాల అనైక్యతకు నిదర్శనంగా భాజపా ప్రచారం చేస్తుంది. కానీ, దీన్ని రాహుల్ గాంధీ ప్రయత్న లోపంగానే ఎక్కువమంది చూస్తుండటం గమనార్హం.