కొన్నాళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరు వెళ్లారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆయన ఒక్క పూట ఉన్నారు. దాని కోసం హోటల్లో బస చేశారు. ఆ ఒక్క పూట ఆయన బెంగళూరులో బస చేసినందుకు అయిన ఖర్చు అక్షరాలా రూ.8 లక్షల 70వేలట. ఈ విషయాన్ని బెంగళూరు మిర్రర్ అనే పత్రిక బయటపెట్టింది. నిజానికి బెంగాల్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వారి బిల్లలు లక్షకు అటూ ఇటూగానే ఉంది. కానీ చంద్రబాబు బిల్లు మాత్రమే రూ. 8 లక్షలు దాటి పోయింది.
ఇలాంటి అవకాశం వస్తే.. సాక్షి అసలు ఊరుకోదు కాబట్టి.. చంద్రబాబు దుబారా మనిషి అని తీర్పిచ్చేసి కథనాలు రాసేయడం ప్రారంభిచింది. బెంగళూరు మిర్రర్ పత్రిక రిపోర్ట్ చేసింది ఒక వైపు.. చంద్రబాబు వైపు వెర్షన్ ఏమిటో ఎవరికీ తెలియదు. దాని గురించి వివరణ ఇవ్వాల్సింత తీరిక కూడా.. చంద్రబాబుకి కానీ.. ఏపీ ప్రభుత్వానికి కానీ ఉండకపోవచ్చు. పైగా ఆ సొమ్ము రాష్ట్ర ఖజానా నుంచి కట్టారని.. సాక్షి మీడియా తీర్పిచ్చేసింది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న లీడర్ చంద్రబాబు. సహజంగానే ఆయనకు, సిబ్బందికి ఎక్కువ రూములు అవసరమై ఉండొచ్చు. పైగా హోటల్‌కి కట్టిన సొమ్ము ఏ రాష్ట్రం కట్టిందనేదానిపైనా క్లారిటీ లేదు. ఆహ్వానించింది కర్ణాటక వారు కాబట్టి… అతిథి మర్యాదలు వారే చేసి ఉంటారు. ఆ బిల్లు కూడా ఆ రాష్ట్రమే కట్టి ఉంటుంది.
కొన్నాళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లోని నివాసాన్ని పడగొట్టి.. కొత్త ఇంటిని కట్టించుకునేటప్పుడు.. కొన్ని రోజులు.. చంద్రబాబు ఫ్యామిలీ.. పార్క్ హయత్‌లోని సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్నారు. అక్కడ సహజంగా ఎక్కువ రెంట్ ఉంటుంది. దీన్ని సాక్షి పత్రిక చిలువలు పలువలుగా ప్రచారం చేసింది. చంద్రబాబు దుబారా ఖర్చు అని రాసేసింది. ఆ కథనాలు చూస్తే.. చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని ఆ హోటల్‌కి కడుతున్నారేమోనన్న అనుమానాలు అందరికీ వస్తాయి. కానీ చంద్రబాబు కుటుంబం.. వారి సొంత డబ్బులతో హోటల్లో బస చేశారు. ఆ విషయం సాక్షికి తెలుసు. ఆ కథనాలు రాసిన వారికీ తెలుసు. కానీ అలాంటి సూచనలే.. తమ కథనాల్లో కనిపించకుండా .. ప్రజల సొమ్మును వాడేస్తున్నారన్న అర్థంలో రాసుకొచ్చారు. ఇప్పుడు కూడా… ఇలాంటిదేదో ఉండే ఉంటుందన్న అంచనాలు సహజంగానే వస్తాయి. కాస్త కలకలం రేగితే వాస్తవాలు అవే బయటకు వస్తాయి.