తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు .. కేంద్ర ప్రభుత్వంపై దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకున్నారు. నెలన్నర వ్యవధిలో రెండు సార్లు ప్రధానమంత్రితో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. విజ్ఞప్తుల చిట్టా ఇచ్చారు. ఒక్క దానికీ ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదు. అలా అని కేంద్రంతో ఘర్షణ పడటం లేదు. ఎన్డీఏ కూటమిలోని పార్టీగానే మసలుకుంటున్నారు. లోక్సభలో విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో నేరుగా ఓటేశారు కూడా. అయినా.. కేంద్రం తెలంగాణపై ఏ మాత్రం సానుకూలత చూపించడం లేదు. అలా రాజ్యసభలో ఓటింగ్ ముగిసిందో లేదో.. ఇలా.. తెలంగాణ ప్రధాన డిమాండ్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇచ్చేది లేదని తేల్చే చెప్పింది.
ఓ వైపు రాజ్యసభలో అనుకూలంగా ఓటింగ్ చేస్తూండగానే..మరో వైపు. లోక్ సభలో ఆ పార్టీ ఎంపీలు తెలంగాణ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేశారు. ఏవీ వర్కవుట్ కాకపోయేసరికి.. చివరికి నేరుగా ఎంపీలంతా ప్రధానమంత్రి వద్దకే వెళ్లారు. బైసన్ పోలో, జింఖానా భూములు ఇవ్వాలని మరోసారి కోరారు. తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ ను ఏర్పాటుచేసుకోవడానికి రక్షణ శాఖ భూములు కావాలని వారు మోదీకి మరోసారి విన్నవించారు. ఇప్పటికే దీనికి సంబంధించి హైలెవల్ కమిటీ భూమిని బదలాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రధానికి గుర్తు చేశారు. కానీ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్క సారిగా యూటర్న్ తీసుకుని పెండింగ్ లో పెట్టారని ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రభుత్వం అడగగానే 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ కు మాత్రం భూమిని బదలాయించకుండ కేంద్ర రక్షణ శాఖ ఆలస్యం చేస్తోందన్నారు. మరో కొత్త మెలికతో స్థలాలు ఇవ్వకుండా కుట్ చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు.
ఇదే కాదు తెలంగాణలో కొత్త జోన్ల విషయాన్ని కూడా కేంద్రం తేల్చడం లేదు. ప్రస్తుతం ఆ ఫైలు ప్రధానమంత్రి వద్దే ఉందని చెబుతున్నారు. మోడీతో … కేసీఆర్ సమావేశం తర్వాత నేడో, రేపో ఉత్తర్వులు వస్తాయంటున్నారు. కానీ ఇంత వరకూ అతీ గతీ లేదు. కేసీఆర్ ప్రధానికి ఇచ్చిన పదకొండు విజ్ఞప్తుల చిట్టాలో.. ఒక్క దానిపై కూడా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీంతో టీఆర్ఎస్ నేతలు నిరాశనలో మునిగిపోయారు.