బాహుబలి స్టుపిడ్ సినిమా అని సూపర్ సీనియర్ నటి జమున చేసిన వ్యాఖ్య సాహసోపేతమైంది. చిత్రంలో తారలు సరిగ్గా అమరలేదని ఆమె అన్నారు గనక ఆ కోణంలోనూ చూసేవాళ్లు వుండొచ్చు. ఎందుకంటే బాహుబలిలో రమ్యకృష్ణ వేసిన వేషం పూర్వాశ్రమంలో భానుమతి,జమున,జి.వరలక్ష్మి వంటి వారు పోషించివుండేవారు. అయితే వయస్సు పైబడి వణికిపోతున్న జమున తనకు వేషం రాలేదు గనక ఆ మాట అని వుంటారనుకోలేము. బ్రహ్మాండమైన సాంకేతిక నిర్మాణ ప్రజ్ఞ, కళ్లు బైర్లు కమ్మే వందల కోట్ల వసూళ్లు నిజమైనప్పటికీ బాహుబలిలో నిరుత్సాహ పరిచే అంశాలు చాలానే వున్నాయి. నేను డి.సురేష్‌బాబును ఇంటర్వ్యూ చేసినప్పుడు అది అసాధారణ చిత్రం కాకున్నా ఒక అనుభవం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. అసలు సినిమా అంటే చూడటం అన్న దృష్టి మారి అనుభూతి ప్రధానమవుతుందని కూడా ఆయన భాష్యం చెప్పారు. ఈ చిత్ర కథకుడూ దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్‌ను కలిసినప్పుడు మామూలుగానే స్పందించారు తప్ప తనకు ఎలాటి భ్రమలూ వున్నట్టు కనిపించలేదు. మిగిలిన చాలామంది సినిమా వారిలో లేని మంచి లక్షణం ఆయనలో వున్నదేమంటే కథ ఎక్కడి నుంచి తీసుకుని ఎలా మార్చింది సూటిగా చెప్పేస్తారు.బాహుబలిలో మొదట కట్టప్ప హీరోను చంపే దృశ్యం చెప్పాననీ తర్వాత అల్లుకుంటూ పోయానని ఆయన ఎక్కడో చెప్పారు. బాహుబలిలో ప్రధానలోపం ఈ మాటల్లోనే చూడొచ్చు. పాత్రలు సన్నివేశాలు అద్భుతంగా వుండాలనే అంశానికి ఇచ్చిన ప్రాధాన్యత వాటిమధ్య అల్లికకు గాని చెప్పే విషయానికి గాని ఇవ్వలేదు. చిత్రం వచ్చినప్పుడే నేను ఫేస్‌బుక్‌లో దీనిపై ఒక విమర్శ రాశాను. జమున విమర్శల తర్వాత దాని ముఖ్యాంశాలు ఇక్కడ ఇస్తున్నా:
భారత దేశంలో వాస్తవిక చిత్రాల వరవడికి పెట్టింది పేరైన రుత్విక్ ఘటక్ ఒక మాట చెప్పాడు. సినిమా అంటేనే మౌలికంగా సంభ్రమం (వండర్ మెంట్) కలిగించేది అని. సంభ్రమం కలిగించడం అనేది ఒకో దశలో ఒక విధంగా వుంటుంది. దేశాలను బట్టి కూడా వుంటుంది. అన్ని చోట్లా ఒకే ప్రభావం కలిగించాలంటే ఆ కథాంశం అత్యంత ప్రాథమికమైంది గానూ ఆ చిత్రీకరణ అత్యాధునికమైందిగానూ వుండాలి. ఈ రెండూ కుదరాలంటే సదరు కథా ప్రయోక్తకు కావలసినంత సృజన స్వేచ్చ వుండాలి. స్వేచ్చ అంటే ఖర్చుకు వెనుకాడకపోవడమే. ఇవన్నీ ఎదురులేకుండా అమరాయి కనకనే రాజమౌళి ‘బాహుబలి’ జాతీయ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం తీయడానికి 200 కోట్లు రెండున్నరేళ్ల కాలం పట్టిందన్నది ఒక చిన్న లేదా పెద్ద వివరం మాత్రమే. రాజమౌళి మగధీరతోనే గాక ఈగ ధీరనూ సృష్టించి చూపాడు గనక ఆయనపై అంత భరోసా ఏర్పడింది. ఇంగ్లీషు వాణిజ్య పత్రికలు దీన్ని ‘సాహసోపేత జూదం’ అన్నాయి. ఆ జూదం ఫలితమిచ్చింది అని కూడా విశ్లేషించాయి.
200 కోట్ల చిత్రాన్ని ప్రచార హౌరు లేకుండా ఎవరైనా ఎలా విడుదల చేస్తారు? చిత్రంపై ఒక అభిప్రాయం ఏర్పడే లోగా లేక చప్పరించేలోగా వసూళ్లు రాబట్టుకోవడం తెలివైన వ్యాపార నీతి. శత చిత్ర రచయిత అయిన ఒక మిత్రుడు రెండున్నరేళ్ల కిందటే ఈ సంగతి చెప్పాడు. రాజమౌళి ఇప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు గాని విడుదలయ్యేది మూడేళ్లకు అని. లవకుశ పాకీజా మొగలే ఆజం వంటివాటితో సహా దీర్ఘకాలం పట్టిన చిత్రాలు చాలా వున్నాయి. కాని రాజమౌళి చేసింది అది కాదు. ప్రణాళికా బద్దంగానే సమయం తీసుకున్నాడు. ఆ క్రమంలో తన స్థాయిని అనూహ్యంగా పెంచుకోవడమే గాక నటీనటులనూ ముఖ్యంగా ప్రభాస్‌నూ రానాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు.
బాహుబలి అచ్చమైన రాజవంశాల కుట్రల కథ మొదటి భాగం. మహిష్మతి రాజ్యాధిపత్యం చుట్టూ కేంద్రీకృతమైన దాయాదుల కథ. కాకపోతే వారిలో ఒకరు టైటిల్ పాత్రధారి ప్రభాస్ వంటి మంచి వాడైతే మరొకడు భల్లాల దేవుడనే రానా వంటి బలీయమైన క్రూర ప్రతినాయకుడు. వీరిద్దరి మధ్య దేవసేన అనే అనుష్క. ఆమె కొడునుకును పెంచి రాజ్యాధిపత్యం అప్పగించాలనుకున్న శివగామి అనే శక్తివంతమైన రమ్యకృష్ణ. అశక్తుడే గాక కుయుక్తుడైన ఆమె భర్త బిజ్జలదేవుడనే నాజర్. సైనిక హౌదా ఏమిటో స్పష్టం గాకున్నా రాజరికానికి కట్టుబానిసగా వుండే మహావీరుడైన కట్టప్ప అనే సత్యరాజ్. జూనియర్ బాహుబలిని ఈ మొత్తం కథలోకి తీసుకురావడానికి కారకురాలైన అవంతిక అనబడే విప్లవకారిణి/విరహిణి తమన్నా. ఈ రాజ్యంపై కాలకేయులనబడే అనాగరిక తెగ దాడి. ఇదే ‘బిగినింగ్’తాను చిన్నప్పటి నుంచి చదివిన చందమామ కథల ప్రేరణతో చిత్ర రూపకల్పన చేసుకున్నానని రాజమౌళి చెప్పారు. జలపాతం, కొండలు, హిమపాతాలు,ప్రాచీన దుర్గాలు, భారీ యుద్ధాలు వింతైన యుద్ధ యంత్రాలు ఇలాటివన్నీ దట్టంగా కూరడమే గాక కనుల పండుగ్గా చూపించగలిగాడు దర్శకుడు. ప్రధాన పాత్రధారులైన యువ నటులు ప్రభాస్ రానాలు గాని రమ్యకృష్ణ గాని మంచి ముద్ర వేస్తారు. రాఘవేంద్రరావు మార్కు పాట ఒకింత విడ్డూరమనిపించినా తమన్నా కూడా తిరుగుబాటుదారుగా చేసిన అభినయం మెప్పిస్తుంది. ఇక అరుంధతి అనుష్క ప్రాధాన్యత వచ్చే భాగంలో చూడాల్సి వుంటుందని ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాడు. అర్థంతరంగా ఆపేసినందుకు అర్థం కాని మలుపు తిప్పినందుకు ప్చ్ అనుకుని మలిభాగం చూసేందుకూ సంసిద్ధుడవుతాడు. అది మరో వ్యాపార రాజ రహస్యం.
వీర గాథలూ, రాజుల కథలు,మంత్రాల కథలు, అద్భుత రసాలు, ఆది వాసుల నమ్మకాలు, ఎత్తులు పై ఎత్తులు, బలాఢ్యుల కథలూ అన్నీ జానపదాలంటుంటారు. మొదట రంగస్థల నాటకాలు సినిమాలుగా వస్తే తర్వాత సాంఘికాల యుగం నడిచింది. మధ్యలో ముడిఫిలిం కొరత వల్ల పరిశ్రమలో సమస్యల వల్ల జానపదాల జోరు పెరిగింది. విఠలాచార్య వాటికి ఒక ప్రత్యేకమైన మార్కెట్ సృష్టించారు. జానపదం అంటేనే జనం చెప్పుకునేది. జానపదాల్లో వీరత్వంతో పాటు సాధారణంగా సామాన్యుల సాహసం వుంటుంది. ఏదో ఒక తిరుగుబాటు వుంటుంది. మంచి రాజు దుష్ట మంత్రి లేదా వెన్నుపోటు వంటివి దానికి కారణమైనప్పటికీ సామాన్య వ్యక్తులు తిరగబడటం సకృత్తుగా చూపిస్తుంటారు. పాతాళభైరవి నుంచి హారీ ప్యాటర్ వరకూ ఇది సాధారణ సూత్రం. అవతార్ కూడా తోకలు మినహాయిస్తే ఒక సెజ్‌ను లేదా ఒక దేశ ఆక్రమణను తలపించింది. అంతెందుకు? రాజమౌళి ఈగ వెనక కూడా సామాన్యుల ఆగ్రహం వుంది గనకే అంతగా ఆకట్టుకుంది. బాహుబలిలో ఆ కోణం లేకపోవడం లోపమే.
దీనికి ముందు అరుదుగా వచ్చిన కొన్ని పెద్ద జానపదాలు- సింహబలుడు, సింహాసనం. సింహగర్జన, భైరవ ద్వీపం వంటివున్నాయి. వీటిలో సింహాసనంలోని రాజకుటుంబ వాతావరణం, సింహబలుడులోని ఎరీనా సెట్టింగుల వంటివాటిపై రాజమౌళి కేంద్రీకరించాడు. పాత్రల మానవ స్వభావ చిత్రణ మామూలు మనుషులకు చోటు కల్పించడం మరిచిపోయాడు. ఎప్పుడూ ఫార్ములా చిత్రాలకే ఆవేశాలు దట్టించి ఆకట్టుకోవడంలో సిద్ధహస్తుడు ఆయన. కాని ఈ చిత్రంలో ఆవేశాలే లోపించాయన్న విమర్శ వచ్చిందంటే కేవలం గ్రాఫిక్స్ సిక్స్ పాక్స్‌పైన పెట్టిన శ్రద్ధ మానవీయ ఘర్షణలనూ వైరుధ్యాలను చూపించకపోవడం వల్లనే. అవి రెండవ భాగంలో వుంటాయనుకున్నా మొదటి భాగంలో వుండకూడదా? 200 కోట్ల చిత్రంలో ఆ రాజ్య ప్రజలకు ఏమైనా చోటుందా? సింహాసనంలో దశార్ణ సింహాసనం,భేరుండామాత్య వంటి పేర్లను తీసుకోవడం విమర్శకు గురైంది. ఈ చిత్రంలోనూ ఆ ధోరణి వుంది. తోట రాముడు నేపాల మాంత్రికుడు చిన్నమయ(మాయాబజార్) వంటి పేర్లు అక్కరకు రావా? కాలకేయులను క్రూరులుగా చెప్పడం కోసం అంత వికృతంగా చూపించడం అవసరమా? కేవలం గ్రాఫిక్స్ కోసం భౌగోళికంగా భిన్నమైన లక్షణాలను చిన్న రాజ్యాల పరిధిలోనే చూపించవలసిందేనా?
జానపదం గురించే కాదు- రాజమౌళి ఇతర చిత్రాల్లోనూ ప్రోటోటైప్‌ను తీసుకున్నప్పుడు చాలా యాంత్రికంగా వ్యవహరిస్తుంటాడు. బలమైన సెంటిమెంటు వల్ల పండటం వేరు, నవరసాలు అమరడం వేరు. ఎప్పుడూ విధేయతనూ విశ్వాసాన్ని అతిగా చూపించడానికే ఆయన పరిమితమవుతుంటాడు. వాస్తవానికి తెలుగులో ఇప్పుడు అగ్రస్థానంలో వున్న నలుగురు దర్శకులూ పాత ఫార్ములాలను అటూ ఇటూ తిప్పి తీయడం తప్ప ఇప్పటి ప్రజల ముఖ్యంగా యువజనుల దృష్టితో ఆలోచించి చైతన్యం పంచాలనుకోవడం లేదు. అలాచేస్తే తెలుగు సినిమా నడత మరో విధంగా వుంటుంది. వ్యాపారం మానుకోనవసరం లేదు, ఆలోచనా ధోరణి మార్చుకుంటే చాలు. అప్పుడే బాహుబలికి ప్రజలిచ్చిన విజయం సార్థకమవుతుంది.ఎందుకంటే రాబోయే కాలంలో మామూలు సినిమాలు తీయడం విడుదల చేయడం విజయం సాధించడం మరింత కష్టమయ్యేంతగా ఆయన మార్కెట్ సృష్టించాడు. నేరుగా హాలివుడ్డు చొరబడినా ఆశ్చర్యం లేదు. అప్పుడు తెలుగు సినిమా స్థానే అచ్చమైన గ్లోబల్ సినిమా వస్తుంది. అతి భారీతనం అద్భుత నైపుణ్యం వున్నా మానవీయంగా వుంటుందా అంటే దర్శక రచయితలకు ఆ దృష్టి కోణం వుంటేనే అది సాధ్యమవుతుంది. అసాధారణ విజయానికి అభినందనలు స్వీకరించడంతో పాటు జక్కన్న ఆ జాగ్రత్తా తీసుకోవడానికి రెండవ భాగంలోనే ప్రయత్నం జరగాలి.