అత్త కొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ బాధపడిపోతున్నారు. వైఎస్ భారతి మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్.. చార్జిషీటు దాఖలు చేయడంతో.. జగన్ పూర్తిగా కంట్రోల్ తప్పి పోయారు. ముందుగా మీడియాకు ఎలా తెలిసిందంటూ… ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. భారతి సిమెంట్స్ పరిశ్రమ వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు.. ఈడీ గుర్తించింది. ఈ మేరకు చార్జిషీట్ వేసింది. ఏ-5 నిందితురాలిగా చేర్చుతూ.. ఈడీ ఎప్పుడు చార్జిషీట్ వేసిందో తెలియదు కానీ.. మీడియాకు మాత్రం గురువారం సాయంత్రం ఉప్పు అందింది. దాంతో ఉదయాన్నే పత్రికల్లో దర్శనం ఇచ్చింది.
దీంతో జగన్ ఒక్కసారిగా హర్టయ్యారు. కుటుంబసభ్యులనూ రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు. చార్జీషీట్ వేయలేదని.. ఓ వర్గం మీడియా మాత్రమే ప్రచారం చేస్తోందన్నారు. కానీ కాసేపటికే.. చార్జిషీట్ విషయం నిజమని తేలిపోయింది. దాంతో ముందుగా మీడియాకు ఎలా తెలిసిందనే కోణంలో పార్టీ తరపున ఆరోపణలు ప్రారంభించారు. శుక్రవారం కోర్టుకు హాజరైన జగన్ కోర్టు సమయం ముగిసిన తర్వాత ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. చార్జిషీటు వేసిన విషయం తమకు కూడా తెలియదని.. చార్జిషీటును కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోక ముందే.. మీడియాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయారు. బహిరంగ లేఖలో ఇద్దరు ఈడీ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఈడీ అధికారులు తనను వేధిస్తున్నారని.. వారిద్దరూ టీడీపీ ఎజెంట్లని చెప్పుకొచ్చారు. జగన్ వాదన ఎలా ఉందంటే.. తన కేసుల విచారణ జరిపితే.. వారు టీడీపీ ఎజెంట్లే అన్నట్లుగా ఆరోపణలు చేశారు. గతంలో వీరిపై ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు .. బెదిరింపు ధోరణిలో జగన్ లేఖలో రాసుకొచ్చారు. వారి కాల్ డేటా బయటకు తీయాలని డిమాండ్ చేశారు.
వ్యవస్థల్ని చేతిలో పెట్టుకుని… అందర్నీ మ్యానేజ్ చేసి.. చంద్రాబాబే అన్నీ చేయిస్తున్నారని అంటున్నారు. మొదట చంద్రబాబు తన తండ్రిని టార్గెట్ చేశారని.. ఆ తర్వాత తనను టార్గెట్ చేశారని.. ఇప్పుడు తన భార్యను టార్గెట్ చేశారని ఆరోపించారు. బీజేపీతో కుమ్మక్కయితే.. పరిస్థితి ఇంత వరకూ వస్తుందా.. అని జగన్ ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కయింది.. చంద్రబాబేనని ఆరోపించారు. భారతిపై చార్జిషీట్ వేసినందుకు.. ఆ విషయం బయటకు తెలిసినందుకే… జగన్ బాధపడిపోతున్నారు. తన భార్యను కూడా కోర్టు చుట్టూ తిప్పాలనుకుంటున్నారని.. ఆవేదన చెందుతున్నారు. మరో వైపు .. ఈ రోజు కోర్టు విచారణకు జగన్ హాజరయ్యారు. కోర్టులో జగన్ తరపు లాయర్ అశోక్ రెడ్డి.. భారతిపై ఈడీ వేసిన చార్జిషీట్ విషయం మీడియాలో వచ్చిందని… దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కానీ ఆ అంశం కోర్టు పరిధిలోకి రాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Open letter regarding today’s yellow media reports pic.twitter.com/ExL03hqgdG
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 10, 2018