వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే తెలంగాణలో పర్యటించారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అయితే, ఇంతవరకూ ఆయన ఏపీ వైపు చూసింది లేదు. ఏపీలో పర్యటించిందీ లేదు! ఆ మధ్య, కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వస్తే… ప్రత్యేక హోదా ఉద్యమ సెగ అక్కడ అమిత్ షాకి బాగానే తగిలింది. అయితే, త్వరలోనే అమిత్ షా ఆంధ్రా టూర్ ఉంటుందని భాజపా వర్గాలల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఆంధ్రాకి అమిత్ షా వస్తే… చెయ్యాల్సిన ఏర్పాట్లు ఏంటనే అంశంపై కూడా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఇతర భాజపా ప్రముఖ నేతల మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అమిత్ షా నేతృత్వంలో భారీ బహిరంగ సభల్ని నిర్వహించే ఆలోచనలో భాజపా ఉన్నట్టు సమాచారం. ఈ సభల ద్వారా కేంద్రం ఆంధ్రాకు చేసిన సాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రాలో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకునే విధంగా కూడా ఈ పర్యటన ఉండాలని ప్లాన్ చేస్తున్నారట! ఎలా అంటే, అమిత్ షా పర్యటనకు వచ్చిన సందర్భంలో… రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతల్ని చేర్చుకునే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తారట. దీని కోసం ఇప్పటికే కొంతమంది ఉన్నత విద్యావంతులు, వ్యాపార వర్గాలకు చెందినవారితో కన్నా లక్ష్మీనారాయణ భేటీ అవుతున్నట్టు సమాచారం. జిల్లా స్థాయి, మండల స్థాయిలో పెద్ద సంఖ్యలో చేరికల కార్యక్రమాన్ని అమిత్ షా ఆధ్వర్యంలో నిర్వహించడం ద్వారా ఆంధ్రాలో తమకు వ్యతిరేకత లేదనే ఒక ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఏపీలో అధికార పార్టీపై విమర్శలు, ఆరోపణలు యథాతథంగా ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి తామే అధికారంలోకి వస్తామనీ, గడచిన ఎన్నికల ట్రాక్ రికార్డులే అందుకు సాక్ష్యమని చెబుతూ… ఆంధ్రాకి జాతీయ స్థాయిలో ఏదైనా సాయం అందాలంటే అది భాజపా ద్వారా మాత్రమే సాధ్యమనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా కలిగించాలన్నది అమిత్ షా టూర్ నేపథ్యంలో లక్ష్యంగా నిర్ణయించారట..!
చివరి కేంద్ర బడ్జెట్, గడచిన రెండు సెషన్ల పార్లమెంటు సమావేశాలు, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం… వీటన్నింటి నేపథ్యంలో ఆంధ్రాలో భాజపాపై వ్యతిరేకత మరింత పెరిగినట్టే అయింది. దీనికితోడు ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కూడా ఇతోదికంగా ఈ మధ్య మాట సాయం చేసి రాజేస్తున్నారు! ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో భాజపా బహిరంగ సభలు పెట్టడాన్ని ఎవరు హర్షిస్తారు..?
Amit Shah to tour Andhra Pradesh