మైత్రీ మూవీస్ ప్రయాణం ఇప్పటి వరకూ అద్భుతంగా సాగింది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం… ఇలా ఒకదాన్ని మంచి మరో హిట్టు కొట్టాయి. సంస్థ పరంగా మైత్రీ మూవీస్‌కి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. ఇక ముందు మరింత జాగ్రత్తగా స్టెప్పులేయాలి, ఇంతకు మించి విజయాలు సాధించాలి. కానీ.. చేతిలో ఉన్న రెండు సినిమాలపైనా కాస్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘సవ్యసాచి’ రెండూ సెట్స్‌పై ఉన్నాయి. రవితేజ – శ్రీనువైట్ల కాంబో ఆసక్తిని రేకెత్తిస్తున్నా, వాళ్లిద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. శ్రీనువైట్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. హిట్లు లేని కారణంగా పారితోషికం కాకుండా కేవలం జీతానికి పనిచేసే స్థాయికి పడిపోయాడాయన. ‘నేల టికెట్టు’ ఫ్లాప్‌తో రవితేజ కూడా ఓ మెట్టు దిగిపోయాడు. పేడవుట్ అయిపోయిన ఇలియానాని వెదికి మరీ పట్టుకొచ్చి ఈ సినిమాలో కథానాయిక చేశారు. ఈ పరిస్థితిలో ఈ సినిమాకి క్రేజ్ తీసుకురావడం మైత్రీకి తలకుమించిన పనే.
మరోవైపు ‘సవ్యసాచి’ కూడా బాగా ఇబ్బంది పెట్టింది. మేకింగ్ పరంగా ఈ సినిమా లేటవుతూ వచ్చింది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ కంటే ముందే మొదలైపోయినా… ఆ సినిమా కంటే ఆలస్యంగా విడుదల అవుతోంది. చైతూనే యాక్షన్ సినిమాలు ఇప్పటి వరకూ వర్కవుట్ అవ్వలేదు. దానికి తోడు ఆలస్యమవుతూ… విడుదలైన ఏ సినిమా కూడా బాక్సాఫీసుని మెప్పించలేదు. ఆ సెంటిమెంట్ ‘సవ్యసాచి’ని బాగా భయపెడుతున్నాయి. ఈ రెండు సినిమాలకు బ్రాండ్… ‘మైత్రీ మూవీస్’ అనే లోగో మాత్రమే. ఆ సంస్థ సాధించిన విజయాల్ని బేరీజు వేసుకుని చూస్తే తప్ప…. ఈ రెండు సినిమాలకూ క్రేజ్ రాదు. అందుకే మైత్రీ మేకర్స్ కూడా.. ఈ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో అనే విషయంపై టెన్షన్పడుతున్నట్టు తెలుస్తోంది. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అవుట్ పుట్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ, మార్పులు చేర్పులూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నార్ట. ‘సవ్యసాచి’ ఫైనల్ కట్ ఇప్పుడు నాగార్జున చేతుల్లో ఉంది. ఆయన ఈ సినిమా చూసి తనవైన సలహాలు ఇస్తారేమో అని చిత్రబృందం ఎదురు చూస్తోంది. నాగ్ సలహాలు ఈమధ్య బాగా పనికొచ్చాయి. తనయుడు సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ తీసుకుంటున్నారు. మరి నాగ్ ఎప్పుడు ఫైనల్ కట్ చూస్తారో..?