పోలవరం ప్రాజెక్టుపై ఎవరికివారు క్రెడిట్ కోసం పాకులాడుతున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం నిర్మాణం చకచకా సాగిందనీ, దాని గురించి మాట్లాడే హక్కు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని వైకాపా నేతలు మాట్లాడతారు. పోలవరం నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీకి కూడా అమాంతంగా బాధ్యత గుర్తొచ్చింది. పోలవరం ముంపు మండలాల్లో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితోపాటు, కొంతమంది కాంగ్రెస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కూడా టీడీపీ సర్కారు మీద ఆరోపణలు చేశారు.
పోలవరం నిర్వాసితులను అధికార పార్టీకి చెందినవారే అన్యాయం చేస్తున్నారని రఘువీరా ఆరోపించారు. నిర్వాసితుల కోసం నిర్మితం అవుతున్న కాలనీల్లో నాణ్యత లేదన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. భూములకు ధరలు ఇవ్వడంతోపాటు, పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. సమస్యల్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామనీ, దాని మీద వెంటనే స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. అంతేకాదు, కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుందని రఘువీరా హామీ ఇచ్చారు.
గడచిన నాలుగేళ్లుగా పోలవరంపై కాంగ్రెస్ పార్టీ ఇంతగా బాధ్యత ప్రదర్శించిందే లేదు! ఇప్పుడు, ఏపీలో మరోసారి పట్టుపెంచుకోవాలన్న పట్టుదల పెరిగేసరికి… ఇవాళ్ల పోలవరం గుర్తొచ్చేసింది, అంతకుముందు ప్రత్యేక హోదా జ్ఞాపకానికి వచ్చేసింది. పోలవరం నిర్మాణంపై కేంద్రం ఎన్ని మెలికలు పెడుతున్నా… ఇన్నాళ్లూ ఈ కాంగ్రెస్ నేతలు ఏం చేశారు? పోలవరం తమ ప్రథమ ప్రాధాన్యం అంటున్న రఘువీరా కూడా ఇన్నాళ్లూ చేసిందేం లేదు. సరే, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ కి బలం లేదూ, ప్రాధాన్యత లేదూ అనుకున్నా… జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. కాబట్టి, దాన్ని త్వరగా పూర్తిచేయాలనీ, నిధులూ అనుమతుల అంశాల్లో జాప్యం చెయ్యొద్దని ఎవరైనా మాట్లాడారా..? మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచే ప్రయత్నమూ చెయ్యలేదు. ఎన్నికలు దగ్గరపడుతుండేసరికి… ప్రత్యేక హోదాపైనా, ఇప్పుడు పోలవరంపైనా కొత్తగా బాధ్యత గుర్తొచ్చినట్టు నేతలు వ్యవహరిస్తున్నారు.