ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేసుకుంటాయి. వాటిని ప్రజల ముందుంచి… సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తుంటాయి. అయితే, ఇన్నాళ్లూ ఇదే పద్ధతిని అవలంభిస్తూ ఉండటం వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏదీ లేదని అంటున్నారు వీవీ లక్ష్మీనారాయణ. అందుకే, తాము ‘మా గ్రామం మేనిఫెస్టో’ పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నామని విశాఖ జిల్లాలో పర్యటన సందర్భంగా చెప్పారు. గ్రామాల్లోని సమస్యలపై ఆయా గ్రామాల ప్రజలతోనే మేనిఫెస్టోలు తయారు చేయించబోతున్నామన్నారు. ఇలా గ్రామానికో మేనిఫెస్టో చొప్పున తయారు చేస్తామనీ, ఎన్నికల ముందు ప్రచారం కోసం వచ్చే నాయకులకు వీటిని అందిస్తామన్నారు.
ప్రజలు తయారుచేసి ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేస్తామంటూ నాయకుల ద్వారా హామీ తీసుకుంటామనీ, అవసరమైతే ఆయా హామీలను తప్పకుండా అమలు చేస్తామంటూ సదరు నాయకులతో వంద రూపాయల బాండ్ పేపరుపై సంతకాలు చేయించే కార్యక్రమం కూడా చేపడతామన్నారు లక్ష్మీనారాయణ. మా గ్రామం మేనిఫెస్టో పేరుతో ఒక వెబ్ సైట్ ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం తాను పర్యటించిన జిల్లాల్లో చాలా సమస్యలు గుర్తించాననీ, వీటిపై కూడా కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు.
పీపుల్స్ మేనిఫెస్టో అనేది మంచి ఆలోచనే. ఎందుకంటే, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేసుకున్నా… రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్ గా చూస్తూ ఇచ్చే హామీలే ఎక్కువగా ఉంటాయి. క్షేత్రస్థాయికి వెళ్లి, అక్కడి సమస్యల్ని పార్టీ మేనిఫెస్టోలో చేర్చే పరిస్థితి ఉండదు. కాబట్టి, ప్రజలే మేనిఫెస్టోలు తయారు చేయడం అనేది మంచి ఆలోచనే. అయితే, గ్రామీణ మేనిఫెస్టోల్లోని హామీలు అమలు చేస్తామంటూ బాండు పేపరుపై సంతకాలు అనేదే ఆచరణ సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు! హామీలకు కట్టుబడి ఉంటామంటూ నోటిమాటగా చెప్పమంటే అందరూ చెప్తారు! కానీ, ఇలా సంతకాలు అంటే ఎలా సాధ్యం..? అలాంటి ప్రయత్నం లక్ష్మీనారాయణ చేయడమూ మంచిదే.
ఇక, రాజకీయ ప్రవేశం విషయానికొస్తే లక్ష్మీనారాయణ ఇప్పటికీ ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు! ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాననే చెప్తున్నారు. ఇప్పటికే తాను తొమ్మిది జిల్లాల్లో పర్యటించాననీ, మిగతా నాలుగు జిల్లాల పర్యటన పూర్తయ్యాక స్పష్టమైన ప్రకటన చేస్తానని మరోసారి లక్ష్మీనారాయణ చెప్పారు.