గతవారం విడుదలైన సినిమాల్లో `చిలసౌ` ఒకటి. విడుదలకు ముందు `అన్నపూర్ణ` ఎంట్రీతో కాస్త పబ్లిసిటీ తెచ్చుకోగలిగింది. విమర్శకులు `ఓకే` అన్నా.. బాక్సాఫీసు దగ్గర మాత్రం అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. కాకపోతే… ఆ బడ్జెట్‌కి మాత్రం న్యాయం చేయగలిగింది. ఫలితం ఎలాగున్నా ఇద్దరి జాతకాలు మాత్రం మారాయని కచ్చితంగా చెప్పొచ్చు. ఒకటి దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ తన మార్క్ చూపించాడు. అప్పటి వరకూ కేవలం నటుడిగానే తన సత్తా చాటిన రాహుల్… తనలో ఓ దర్శకుడు ఉన్నాడని బయటపెట్టాడు. న్యూ ఏజ్ లవ్ స్టోరీల్ని బాగా హ్యాండిల్ చేయగలడని అర్థమైంది. తొలి సినిమా విడుదలకు ముందే అన్నపూర్ణ దృష్టిలో పడ్డాడు. ఆ సంస్థ నుంచి ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ కూడా అందుకున్నాడు.
ఇక… సుశాంత్ విషయానికొద్దాం. ఇప్పటి వరకూ సుశాంత్ సినిమా ఒక్కటి కూడా `చిలసౌ`లా టాక్ తెచ్చుకోలేకపోయింది. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టిన సుశాంత్ తొలిసారి.. ఓ ప్రేమ కథని ఎంచుకోవడం, అందుకోసం తన బాడీ లాంగ్వేజ్ నీ స్టైల్‌నీ మార్చుకోవడం నచ్చింది. ఇక ముందు సుశాంత్ ఇలాంటి కథల్ని ఎంచుకుంటే ఫలితం ఉంటుంది. ఇప్పటి వరకూ యాక్షన్ కథలకే పనికొస్తాడేమో అనుకున్న సుశాంత్… ప్రేమకథలకూ నప్పుతాడని నిరూపించుకున్నాడు. పైగా… ఇలాంటి కథల్ని తక్కువ బడ్జెట్లో పూర్తి చేయొచ్చు. ఇది వరకు సుశాంత్ ఎంచుకున్న కథలన్నీ 4 నుంచి 5 కోట్ల బడ్జెట్‌ని డిమాండ్ చేసేవి. ఈజోనర్ అయితే.. ఆబడ్జెట్లో రెండు మూడు సినిమాల్ని తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో.. చిలసౌ ఫలితం ఎలాఉన్నా ఇద్దరి జీవితాలకు మాత్రం కొత్త మార్గం చూపించగలిగింది.