ప్రేక్షకులకు మెసేజ్ ఇవ్వాలనుకుంటే సినిమా తీయక్కర్లెద్దు
సెల్ఫోన్లో ఓ సందేశం పంపితే చాలు..
ఇదీ సినీ జనాలు తరకూ చెప్పే మాట. మేం కమర్షియల్ సినిమాలే తీస్తాం- సందేశాత్మక కథలు అవసరం చెప్పాల్సిన అవసరం లేదు – అని చాలామంది దర్శకులు, నిర్మాతలు కాస్త గట్టిగానే చెప్పారు. సినిమా అనేది కేవలం బిజినెస్ అంటూ ప్రేక్షకుడూ నమ్మడం మొదలెట్టాడు. కమర్షియాలిటీకి అలవాటు పడిపోయాడు. అయితే.. ప్రతీ సినిమా, ప్రతీ కథ వెనుక ఓ అంతఃర ఉద్దేశ్యం ఉంటుంది. అది మంచి మాట చెప్పడమే. దాన్ని ఏదో పాఠంలా, సందేశంలా, క్లాసులా చెప్పకుండా… సుతి మెత్తగా కథలోనే సందేశాన్ని ఇమిడ్చి, దానికి కమర్షియల్ కోటింగ్ ఇవ్వడం అలవాటు చేసుకున్నారు.
కొరటాల శివనే తీసుకోండి. మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను… వీటికి కేవలం కమర్షియల్ సినిమాలుగానే చూస్తామా? అందులో ఎక్కడో చోట… సమాజానికి ఉపయోగపడే సందేశం వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఓ విధంగా ఆయా సినిమాలు క్లిక్ అయ్యాకంటే, కేవలం హిట్స్‌తో సరిపెట్టకుండా – కలకాలం నిలిచిపోయాయంటే.. అదంతా అందులో ఉన్న మంచి విషయాలే. క్రిష్ కూడా అంతే. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూటిగా, హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తుంటాడు. త్రివిక్రమ్ కూడా అంతే. మరీ తన డైలాగులు క్లాసు పీకేలా ఉండవు. పైగా సమాజం, మంచితనం అంటూ ఊకదండపుడు ఉపన్యాసాలు ఇవ్వడు. కేవలం బంధాలు, అనుబంధాల గురించి మాట్లాడతాడు. అదీ లాజికల్‌గా.
రచయితలు దర్శకులు అయితే చాలా ప్లస్సులుంటాయి. దాంతో పాటు బలమైన ‘మైనస్’ కూడా ఉంటుంది. రాసుకున్న ప్రతీ విషయాన్నీ చెప్పాలని ఆత్రుత పడతారు. త్రివిక్రమ్ కీ అది ఉంది. కాకపోతే… త్రివిక్రమ్ డైలాగుల్లో ఉండే మ్యాజిక్ ముందు అది కనిపించకుండా పోతుంది. ఆర్. ఎక్స్ 100ని తీసుకోండి. ఇప్పటి అమ్మాయిల మనస్తత్వాలకు అద్దం పట్టే కథ అది. నిజానికి అమ్మాయిలంటే, వాళ్ల ప్రేమంటే.. అంటూ అర్థం పర్థం లేని డైలాగుల్ని పేజీల కొద్దీ రాసేసి. మసాలా పూసే అవకాశం ఉంది. కానీ.. దర్శకుడు వాస్తవికతకు దగ్గరగా వెళ్లి, అవసరమైన మేరకు మాత్రమే డైలాగులు రాసుకున్నాడు. దాంతో సహజత్వం కనిపించింది. ఆయా సన్నివేశాలు కూడా బుర్రకు ఎక్కించుకోగలిగారు.
సతీష్ వేగ్నేశ కూడా రచయిత కుటుంబం నుంచి వచ్చిన దర్శకుడే. తన బలం… మాటలు. ‘శతమానం భవతి’లో సంభాషణలు కీలకపాత్ర పోషించాయి. బహుశా.. ఆ విషయం ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనేమో… ‘శ్రీనివాస కల్యాణం’లో అనవసరమైన డైలాగులు రాసేసుకున్నాడు. నితిన్‌ని ఉపయోగించుకుంటూ ప్రతీచోటా ప్రేక్షకులకు క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యాడు. ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సందర్భంలోనూ, శుభలేఖ సుధాకర్ ఎపిసోడ్‌లోనూ నితిన్ క్లాసు పీకుడు వ్యవహారాలు ప్రేక్షకుల బుర్రకు ‘ఎక్కలేదు. ప్రకాష్ రాజ్‌తో చేసే ఆర్గ్యుమెంట్లు కూడా దాదాపుగా క్లాసులుగానే సాగాయి. సంభాషణల్లో పదును ఉన్నా.. ప్రేక్షకులు ఆ డైలాగుల్ని సీరియెస్‌గా తీసుకోలేదు. సరి కదా, థియేటర్లో ఎటకారాలు చేసుకున్నారు. ఎప్పుడైతే… ఆడిటోరియం మన మాటల్ని సీరియెస్‌గా తీసుకోవడం మానేసిందో అప్పుడే కథ గాడి తప్పేసినట్టు అని అర్థం చేసుకోవాలి. ‘శ్రీనివాస కల్యాణం’లో కనిపించిన ప్రధాన లోపం ఇదే.
ఇలా ఉండాలి, ఇలా చేయాలి.. అని చెబితే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్లకు మంచేదో చెడోదే స్పష్టంగా తెలుసు. ‘సరదాగా సినిమా చూడ్డానికి వస్తే ఈ క్లాసుల గోలేంటి?’ అని జుత్తు పీక్కునే ప్రమాదం కూడా ఉంది. ఓ బలమైన సమస్యని ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు.. వాళ్లకు హితబోధ చేయడం మంచిదేమో.. అది కూడా సుతిమెత్తగా. ఇలా క్లాసులు పీకడం మొదలెడితే… ఫలితం ‘శ్రీనివాస కల్యాణం’లానే ఉంటాయి. ఇక ముందు ఏ రచయితైనా పెన్ను పట్టుకొనే ముందు ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిదేమో.