విశాఖలో జరిగిన ‘గీత గోవిందం’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో సాధారణంగా సినిమా ఫంక్షన్స్‌లో కనిపించే కళ కనిపించలేదు. పైరసీ ప్రభావం ఫంక్షన్లో సుస్పష్టంగా కనిపించింది. చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ పైరసీ క్లిప్పింగులు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌లో షేర్ చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు. చిత్ర నిర్మాత ‘బన్నీ’ వాసు పైరసీ లింకులు డిలీట్ చేయించడంలో బిజీగా ఉండటం వలన ప్రీ–రిలీజ్‌కి రాలేకపోయారని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. వచ్చినవారు కూడా ఫంక్షన్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారని, అందరూ సెల్‌ఫోన్స్ పట్టుకుని పైరసీ టీమ్‌కి లింకులు పంపిస్తూ కూర్చున్నామని తెలిపారు. ఇంకా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘పైరసీ గురించి ఏం చెప్పాలబ్బా? దానిగురించి చెప్పి కూడా వేస్ట్! ప్రేక్షకులకు ఏది రైట్? ఏది రాంగ్? అనేది తెలుసు. మా టీమ్ అంతా ఎంతో కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందని, వాళ్ల స్పందన కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా జరిగింది. దీన్ని తలచుకుని బాధపడాలని అనుకోవడం లేదు. రెండు రోజుల్లో సినిమా విడులవుతుంది. థియేటర్లు నవ్వులతో నిండుతాయి’’ అని చెప్పారు. అసలు పైరసీ సమస్య వలన ఫంక్షన్‌కి వచ్చి హాయ్ చెప్పి వెళ్లాలనుకున్నాని, అయితే ప్రేక్షకుల అరుపులతో ఎనర్జీ వచ్చిందని అన్నాడు.