జూలై 29వ తేదీ. ఆదివారం.. సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ స్టాఫ్ చాలా హడావుడి పడిపోయారు. ఎందుకంటే… అంతకు ముందు రోజు.. జగన్.. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. వాటిని ఎంత పాజిటివ్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదానిపై చర్చోపచర్చలు జరిగాయి. ఎలా ప్రజెంట్ చేయాలో చివరి క్షణం వరకూ హైరానా పడిపోయారు. చివరికి ఏదో ఒకటి చేయడం కన్నా మామూలుగా చేసేయడం బెటర్ అని అలానే చేశారు. కానీ అదే సమయంలో ఆ పత్రిక ఫ్యామిలీ పేజీ విషయంలో అంతకంటే ఎక్కువ రచ్చ జరిగింది. కానీ అక్కడ జగన్ విషయం కాదు… షర్మిల. అవును షర్మిల గురించే.
సాక్షి ఫ్యామిలీ పేజీని “తొక్క తీసే లవ్ డాక్టర్” ప్రియదర్శిని రామ్ చూస్తూంటారు. ఆ పేజీలో ఏమి రావాలన్నా ఆయన క్రియేటివిటీనే. వారం రోజులుగా ఆయన జూలై 29వ పేజీని అలంకరిద్దామని కసరత్తు చేశారు. పేజీలు డిజైన్ చేశారు. ఇంటర్యూ తీసుకొచ్చారు. ఇదంతా చేసింది.. జూలైన 29న ఫ్యామిలీ పేజీలో అలంకరించాలనుకున్నది… షర్మిల గురించి. షర్మిల పాదయాత్ర గురించి. ఆ రోజు ఆమె… పాదయాత్ర పూర్తి చేసి.. ఐదేళ్లు పూర్తవుతుంది. “మరో ప్రజా ప్రస్థానం” పేరుతో మూడు వేల కిలోమీటర్లకుపైగా ఆమె నడచి .. చరిత్ర సృష్టించిన రోజు అది. ఓ వైపు జగన్ జైల్లో ఉన్నప్పుడు.. చంద్రబాబునాయుడు పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పోటాపోటీగా పాదయాత్ర చేసి.. వైసీపీని నిలబెట్టిన పాదయాత్ర అది. అందుకే ప్రియదర్శిని రామ్.. ఆ పాదయాత్రలోని కీలక ఘట్టాలతో పాటు.. షర్మిల ఇంటర్యూను కూడా తీసుకుని.. నాలుగైదు పేజీలు అందంగా ముస్తాబు చేసారు. వాటిని తీసుకెళ్లి.. భారతి తరపున సాక్షి వ్యవహారాలన్నీ చక్కబెట్టే రాణిరెడ్డి అనే ఆమెకు చూపించారు. పై నుంచి తనకు ప్రశంశలు వస్తాయని… ప్రియదర్శిని రామ్ అనుకున్నారు… కానీ చీవాట్లు వచ్చి పడ్డాయి. అసలు ప్రియదర్శిని రామ్ డిజైన్ చేసిన ఫ్యామిలీ పేజీలో ఒక్కటంటే ఒక్క పేజీ కూడా ప్రింట్కు వెళ్లకూడదని ఆదేశాలొచ్చాయి. దాంతో ఉన్న పళంగా రిజర్వ్‌లో ఉంచిన ఘంటసాల సతీమణి ఇంటర్యూను.. సందర్భం లేకపోయినా… ప్రచురించేశారు.
ప్రస్తుతం వైఎస్ జగన్ సతీమణి భారతినే…సాక్షి వ్యవహారాలన్నింటినీ చూస్తున్నారు. ఆమెకు.. రైట్ హ్యాండ్‌గా రాణి రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే షర్మిల పాదయాత్రపై కవరేజీ ఇస్తే.. పార్టీకే మేలు జరుగుతందని… ప్రియదర్శిని రామ్ భావించారేమోకానీ… పై స్థాయిలో మాత్రం అలా అనుకోలేదు. ఓ వైపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరుగుతూంటే.. మరో వైపు అయిపోయిన పాదయాత్ర గురించి ఎందుకంత ప్రయారిటీ అని చైర్పర్సన్ భారతి రామ్‌పై పడినట్లు సాక్షి కార్యాలయంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. జగన్ పాదయాత్రకు తప్ప ఇక ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారట. దీంతో ఓ వైపు రామ్ వ్యవహారంతో పాటు.. జగన్ కుటుంబంలో ఏం జరుగుతోందన్న చర్చ కూడా.. అంచెంలంచెలుగా పెరుగుతూ వస్తోంది.
మొత్తానికి ప్రియదర్శిని రామ్ వ్యవహారం.. మొదటి నుంచి వైఎస్ భారతిరెడ్డికి మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే టీవీతో పాటు… పేపర్లోనూ.. చక్రం తిప్పిన స్థాయి నుంచి …అనూహ్యంగా అవమానకరంగా బయటకు పంపేశారు. అయినా ఎలాగోలా కొన్నాళ్ల తర్వాత మళ్లీ వచ్చినా.. ఫ్యామిలీ పేజీకి మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు అది కూడా.. ఉండేలా పరిస్థితులు లేవు. ఈ ఘటనతో ఒక్క విషయం మాత్రం స్పష్టమయిందని సాక్షి సిబ్బంది చెప్పుకుంటున్నారు.. అదే జగన్ ఫ్యామిలీ ఆల్ ఈజ్ నాట్ వెల్ అని.. !