డాన్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘ఏబీసీడీ’. దానికి కొనసాగింపూ వచ్చింది. రెండింట్లోనూ డాన్సింగ్ స్టార్లుగా ఎదగాలని ఆరాటపడే యువకుల్ని చూపించారు. రెండింటిలోనూ ప్రభుదేవానే కథానాయకుడు. ఇప్పుడు ‘లక్ష్మి’ అనే మరో డాన్సుల కథ వస్తోంది. దీంట్లోనూ ప్రభుదేవానే హీరో. కాకపోతే.. ఈ కథ `ఏబీసీడీ`కి బేబీ వెర్షన్‌లా అనిపిస్తుంది. లక్ష్మి అనే ఓ అమ్మాయి డాన్సర్‌గా ఎలా ఎదిగింది? దానికి ప్రభుదేవా ఎలా సహాయపడ్డాడు? అనేదే కథ. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సి.కల్యాణ్ విడుదల చేస్తున్నారు. కాస్త స్ఫూర్తి నింపితే చాలు… ఆయా సినిమాలకు పట్టం కట్టేస్తుంటారు ప్రేక్షకులు. అలా డాన్సింగ్ కథలకు సౌత్‌లోనే కాదు, నార్త్‌లోనూ మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడాయి. కాకపోతే… ప్రతీసారీ ఓకే తరహా కథ ఎంచుకోవడం వల్ల కిక్ తగ్గిపోతుంటుంది. దానికి తోడు కథ, కథనాలు ఎలా సాగుతాయో ప్రేక్షకులు ఈజీగా గ్రహించేస్తున్నారు. అయితే.. విజయ్ సున్నితమైన విషయాల్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. హ్యూమన్ ఎమోషన్స్‌కి ప్రాధాన్యం ఇస్తాడు. అది ఈ సినిమాకి ప్లస్ అవ్వొచ్చు. విజయ్ – ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన ‘అభినేత్రి’ ఫ్లాప్ అయ్యింది. మరి… ఈసారైనా వీరిద్దరూ సక్సెస్ కొడతారో, లేదో చూడాలి.