తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహిళా సంఘాల సమావేశంలో పాల్గొన్నారు. కొంతమంది మహిళలు అడిగిన ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నిరంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆయన ప్రసంగంలో ఎక్కువగా మహిళల సాధికారికతపైనే సాగింది. తెలంగాణలో, ఢిల్లీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని ప్రభుత్వాలున్నాయని విమర్శించారు. ఆడవాళ్లంటే వంటిల్లుకు మాత్రమే పరిమితం చెయ్యాలనేది ఈ రెండు ప్రభుత్వాల ఉద్దేశమనీ… కానీ, మహిళా శక్తిని దేశ సమగ్రతకు వినియోగించాలన్నది కాంగ్రెస్ ఆశయమన్నారు. ఆడపిల్లల్ని రక్షించాలీ, చదివించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్పగా ప్రచారం చేసుకుంటారన్నారు. కానీ, బీహార్ లో చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే మాట్లాడరన్నారు. ఉత్తరప్రదేశ్ లో భాజపా నాయకుడే అత్యాచారానికి పాల్పడితే నోరు మెదపలేదన్నారు
జీఎస్టీ గురించి మాట్లాడుతూ… ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పన్ను చెల్లింపు విధానాన్ని మరింత సులభతరం చేస్తామనీ, ఐదు స్లాబులు లేకుండా ఒకే పన్ను ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ… పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు, బ్యాంకుల ముందు అందరూ లైన్లలో నిబడ్డారనీ, కానీ ఒక్క ధనవంతుడైనా క్యూలో నిలబడటం ఎవరైనాచూశారా..? అంటే, వారి దగ్గర సొమ్ము లేదా అంటూ ప్రశ్నించారు. దొడ్డిదారిలో వారి నల్లధనం మార్చేసుకున్నారని ఆరోపించారు. కోటీశ్వరులు అప్పులు చేసి ఎగ్గొడితే ఈ ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదనీ, వాళ్లకి వేల కోట్ల రూపాయల రుణమాఫీ మోడీ సర్కారు చేసిందని ఎద్దేవా చేవారు. కానీ, కష్టాల్లో ఉన్న రైతులు, మహిళా సంఘాలు రుణమాఫీలు అంటే కుదరదు పొమ్మంటున్నారని మండిపడ్డారు. రైతులకీ, మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం లేదనీ… వారికి రుణాలు ఇస్తే నిరుద్యోగం గణనీయంగా తగ్గించ వచ్చనీ, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అంశాలకు ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తుందని రాహుల్ చెప్పారు.
దేశవ్యాప్తంగా రైతులకు రూ. 10 వేల కోట్ల మద్దతు ధర పెంచుతున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా ప్రకటించారనీ, కానీ తాము కర్ణాటకలో రైతుల కోసం రూ. 30 వేల కోట్లు విడుదల చేసి రుణమాఫీ చేశామని రాహుల్ చెప్పారు. దేశవ్యాప్తంగా చేస్తానంటూ మోడీ ప్రకటించిన మొత్తం కంటే, ఇది మూడు రెట్లు ఎక్కువ అని చెప్పారు. ప్రజల అకౌంట్లలో లక్షల రూపాయలు వేస్తామనే హామీలు తాము ఇవ్వమనీ, ఆచరణ సాధమైన అంశాలే మాట్లాడుతున్నామని రాహుల్ చెప్పారు.
ప్రధానంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని రాహుల్ ప్రసంగం సాగింది. అయితే, తెలంగాణలోని తెరాసతోపాటు, మోడీ సర్కారును కూడా ఒకేగాటన కట్టి విమర్శలు చేయడం విశేషం. తెలంగాణలో ప్రభుత్వం ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులే, మోడీ సర్కారు వల్ల దేశవ్యాప్తంగా ఉంటున్నాయన్నారు. తెరాస, భాజపా సర్కారుల మధ్య ఒక సారూప్యతను పరోక్షంగా చూపించే ప్రయత్నం చేశారు. తెరాసను భాజపాకు దగ్గర చేసి విమర్శించినట్టుగా అనిపిస్తోంది.