అల్లు అరవింద్ నుంచి మొదలుపెడితే దర్శకుడు పరశురామ్, నిర్మాత ‘బన్ని’ వాస్‌తో పాటు ‘గీత గోవిందం’ చిత్రంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరూ మీడియా ముందు విజయ్ దేవరకొండ గురించి చెప్పేవన్నీ మంచి మాటలే. వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా వుందట. ‘గీత గోవిందం’ పబ్లిసిటీకి విజయ్ దేవరకొండ సరిగా సహకరించడం లేదని గుసగుస. ఈ ఒక్క విషయంలో హీరోకి, గీతా జనాలకు మధ్య సయోధ్య కుదరడం లేదని సమాచారం. ప్రచార కార్యక్రమాల విషయంలో గీతా జనాలకు చుక్కలు చూపిస్తున్నాడట. ‘అర్జున్‌రెడ్డి’ తరవాత తనకంటూ ప్రత్యేకంగా ఒక పీఆర్ టీమ్‌ని ఈ హీరో ఏర్పాటు చేసుకున్నాడు. ‘టాక్సీవాలా’ కోసం చిన్న పిల్లలతో ఒక వీడియో చేసి వదిలారు కదా! అటువంటి ఐడియాలు ఈ టీమ్ ఇస్తుంటుంది. అందులో నచ్చిన వాటిని హీరోగారు ఎంపిక చేసుకుంటారు. ‘గీత గోవిందం’ చిత్రానికీ తన టీమ్ ఐడియాలకు మేరకు పబ్లిసిటీ వగైరా వగైరా నిర్వహించాలనేది విజయ్ దేవరకొండ అభిమతం. మరోపక్క గీతా ఆర్ట్స్ సంస్థకు రెగ్యులర్ పీఆర్ టీమ్ ఒకటి వుంది. గీతాలోని పైస్థాయి వ్యక్తుల ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ల సూచనల మేరకు ఈ టీమ్ నడుచుకుంటుంది. యధావిధిగా గీతా ఆర్ట్స్ సంస్థ చిత్రాలకు ముందస్తుగా వీడియో ఇంటర్వ్యూలు గట్రా ఎలా ప్లాన్ చేస్తారో? అదే విధంగా విజయ్ దేవరకొండతో ప్లాన్ చేశార్ట. ఇంటర్వ్యూ ఐడియా గురించి చెప్పగానే సరే అని, తరవాత తన టీమ్‌తో చర్చించిన విజయ్ దేవరకొండ చివరి నిముషంలో వద్దని అంటున్నాడట. లేదంటే టైమ్ మార్చమని చెబుతున్నాడట. దాంతో గీతా జనాలు తలలు పట్టుకుంటున్నార్ట. ఈ సమస్య ఒక్క ‘గీత గోవిందం’తో తీరేది కాదు. ‘టాక్సీవాలా’కూ వుంటుందేమో!! అదీ గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ చిత్రమే.