ముఖ్యమంత్రి పదవి గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు! పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన ప్రజాపోరాట యాత్రలో పవన్ పాల్గొన్నారు. జనసేన సిద్ధం చేయబోతున్న మేనిఫెస్టోలో అన్ని వర్గాలకూ న్యాయం చేస్తామన్నారు. మంత్రి నారా లోకేష్ ని ఉద్దేశించి మాట్లాడుతూ… ‘నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే అరవయ్యేళ్లు ఆగాల’న్నారు. 60 ఏళ్లపాటు సినీ పరిశ్రమలో కష్టపడ్డాక ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. తాను కూడా ప్రజల సమస్యలపై పోరాడుతున్నాననీ, కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న సినీ రంగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎన్టీఆర్ ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి పదవి దక్కించుకుంటే… ఆయనకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు సీఎం పీఠాన్ని లాక్కున్నారని లోకేష్ గుర్తుంచుకోవాలన్నారు!
ముఖ్యమంత్రి పీఠంపై పవన్ కల్యాణ్ వైఖరి మూడు రకాలుగా మారుతూ వచ్చింది. మొదట్లో తాను కాలేను అనేవారు! ‘అభిమానులు సీఎం సీఎం అంటుంటే ఏమీ అనిపించదు. నాకు అలాంటి ఆశలేదు. అధికారం కంటే.. పార్టీ పాతికేళ్ల ప్రయాణం ముఖ్యం. సీఎం పదవి ఎంతో కష్టమైంది. ఎన్నో బాధ్యతలుంటాయి, వాటికి ఎంతో అనుభవం కావాలి’ అనేవారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న పవన్ ఇది! ప్రతిపక్ష నేత జగన్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతా, అనుభవం లేదన్నారు. కొన్నినెలలు గడిచేసరి.. ప్రజలు సమస్యలు అర్థం చేసుకున్నాకనే తాను కూడా సీఎం కావొచ్చన్నారు. తరువాత, 2004 నుంచి తాను రాజకీయాల్లో ఉంటున్నాననీ… పదేళ్లకు పైబడిన అనుభవం తనకీ ఉందనీ… 2009 ఎన్నికల్లో తాను అనుకుంటే ఏదో ఒక పదవి వచ్చేదనీ.. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తాను చేసిన తప్పు అంటూ వ్యాఖ్యానించారు. బస్సుయాత్రకు వచ్చేసరికి… జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనీ, అందరికీ న్యాయం చేస్తానంటూ తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని స్వయంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు… నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలంటే అరవయ్యేళ్లు ఆగాలంటున్నారు!
ఇంత గందరగోళం ఎందుకు..? ‘నేను ముఖ్యమంత్రి అవుతా’ అంటే ఎవరైనా కాదంటారా..? ఎప్పటికప్పుడు దాని అర్హతల గురించి మాట్లాడుతూ… ఆ తరువాత, ఆ అర్హతలు తనకీ ఉన్నాయని నిరూపించుకునేందుకు ఆరాటపడుతూ… ఇతరులకు ఆ అర్హతలేదంటూ సర్టిఫై చేస్తూ… ఎందుకింత చర్చ! రాజకీయ పార్టీలు ఏవైనా అంతిమ లక్ష్యం అధికార సాధనే. దాని కోసమే కదా పోరాటం! అయితే, ఒక నాయకుడు ముఖ్యమంత్రి కావాలో వద్దో నిర్ణయించేది అంతిమంగా ప్రజలు. అనుభవాలు, అర్హతలు వారే చూసుకుంటారు. తమ భవిష్యత్తునీ, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్నీ ఎవరైతే సమర్థంగా నడిపించగలరని ప్రజలు నమ్ముతారో… వారికే అధికారం ఇస్తారు. నేను కాలేనని కాసేపు, అయ్యే అవకాశాలున్నాయని మరోసారి, ఎదుటివారు కాలేరని ఇంకోసారి.. ఇలా ముఖ్యమంత్రి పదవి గురించి పవన్ వైఖరి మార్చుకుంటూ ఉండటం వల్ల పెద్దగా తేడా ఉంటుందా..? ఈ గందగోళ వైఖరి వల్ల ప్రజల్లోకి వేరే రకమైన సంకేతాలు వెళ్తాయి కదా. నాయకుల సమర్థతను ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారు.