బయోపిక్‌ల పరంపరలో మరో సినిమా రాబోతోంది. ఒకప్పటి అందాల తార, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌కి రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. జయలలిత మరణించిన వెంటనే ఒకట్రెండు బయోపిక్‌లు ప్రకటించారు. రాంగోపాల్‌వర్మ, దాసరి నారాయణరావు లాంటి దగ్గజాలు కర్చీఫ్‌లు వేశారు. అయితే దాసరి మరణంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. వర్మ మూడ్ మరో సినిమాపై పడిపోయింది. ఇక జయలలిత బయోపిక్ చూడలేమనుకుంటున్న తరుణంలో… ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ జరగబోతున్నట్టు తెలిసింది. సి.కల్యాణ్ నిర్మాతగా ఈ బయోపిక్‌ని తెరకెక్కిస్తారని, తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇటీవల `లక్ష్మి` ఆడియో వేడుకలో `త్వరలో ఓ సంచలనాత్మక చిత్రం చేయబోతున్నా` అని కల్యాణ్ ప్రకటించారు. అది జయలలిత బయోపిక్కే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. దక్షిణాదిన నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ఓ కథానాయిక జయలలిత పాత్రని పోషించబోతోందట. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేస్తారని తెలుస్తోంది.