జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఆగస్టుల పదిహేనో తేదీన మ్యానిఫెస్టో ప్రకటిస్తానని గతంలో ప్రకటించారు. కానీ ఒక రోజు ముందుగా విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఇది కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమేనని.. అసలు మ్యానిఫెస్టోలో ఉండే.. మచ్చుకు కొన్ని మాత్రమేనని చెప్పుకొచ్చారు. విజన్ డాక్యుమెంట్లో 12 అంశాలను పొందుపరిచారు. ఆ వివరాలు… రేషన్ తీసుకునే మహిళల ఖాతాల్లో నెలకు రూ. 2500 నుంచి 3500 వరకు జమ, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు మరో ఐదు శాతం పెంచే ఆలోచన, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్ కింద రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేయడం, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ సిఫార్సులు అమలు చేయడం, మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు వసతి గృహాలు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు… ఉన్నాయి.
విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసే ముందు.. పవన్ కల్యాణ్ భీమవరంలోని మావూళ్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొత్త రాజకీయాలు చేస్తానన్న పవన్ కల్యాణ్ .. విజన్ డాక్యుమెంట్ లో మాత్రం… పాత రాజకీయాలే చేశారు. జనాకర్షణే ప్రధానంగా వ్యవహరించారు. రేషన్ కార్డులకు ఉన్న మహిళలకు నగదు బదిలీ చేస్తామని ప్రకటించారు. ఇక సమాజంలో ప్రధానంగా కీలకమైన ఇష్యూలుగా ఉన్న రిజర్వేషన్ల అంశాలన్నింటినీ విజన్ డాక్యుమెంట్ లో పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. అన్నింటినీ పరిష్కారాలు చూపిస్తామన్నారు. చివరికి కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. కానీ అది కేంద్రం చేతుల్లో ఉంటుంది.
నిజానికి పవన్ కల్యాణ్ తన విజన్ డాక్యుమెంట్లో ఉన్నవన్నీ రాజకీయ పార్టీలు చెప్పేవే. కానీ ఆయా సమస్యలకు పరిష్కారాలు మాత్రం ఆయా పార్టీలకు చేత కావడం లేదు. పవన్ కల్యాణ్ ఇవే విషయాలతో ప్రజల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు.. ఎలా పరిష్కరిస్తారో.. హామీలను ఎలా నెరవేరుస్తారో… తన విజన్‌ను ప్రజల ముందు ఆవిష్కరించి ఉండి ఉంటే బాగుండేది.కానీ.. ఓ ప్రెస్‌నోట్‌లా.. కొన్ని పాయింట్లను… రిలీజ్ చేయడానికి…దానికి ప్రిమ్యానిఫెస్టో పేరుతో ప్రచారం చేశారు. హైప్ క్రియేట్ చేశారు. చివరికి… అందులో హామీలు మాత్రమే ఉండటంతో.. జనసేన ఫ్యాన్స్ కించిత్ నిరాశ చెందారు. కానీ.. తమ నేత…చెప్పినవన్నీ చేసి చూపిస్తారన్న నమ్మకంతో ఉన్నారు.