తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రతిష్టాత్మక పధకాలను ప్రవేశపెట్టింది. ఒకటి రైతుల జీవితానికి భద్రతనిచ్చే.. రైతుబీమా పథకం. రెండు.. కంటి చూపు సమస్యలున్న ప్రతి ఒక్కరికీ వైద్యం అందించే కంటి వెలుగు కార్యక్రమం. ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు కావడంతో… తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఖర్చుతో ప్రకటనలు కూడా సిద్ధం చేసింది. పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచురిస్తున్నారు.. ప్రసారం చేస్తున్నారు కూడా. కానీ ఇన్నీ ప్రకటనల్లోనూ ఒకే ఒక్క తప్పు.. మొత్తం ప్రచారం మైలేజీని తగ్గించి పడేసింది. నమ్మక తప్పదు. ఆ తప్పు ఏమిటంటే.. రెండు వేర్వేరు ప్రకటనలకు.. ఒకే ఫోటో వాడుకోవడం.. దాన్ని ఫోటో షాప్ చేయడం. ఆ చేయడం కూడా… అందరూ నవ్వుకునేలా చేయడం.
రైతుబీమా పథకం కోసం.. ఓ భార్య, భర్త, బిడ్డతో ఫోటో షూట్ చేశారు సదరు యాడ్స్ మెయిన్మెటెన్ చేసే ఎజెన్సీ వాళ్లు. దాన్ని వాడేశారు. తర్వాత కంటి వెలుగు పథకం కోసం ఫోటో షూట్ చేసేంత తీరిక లేకపోయింది. అక్కడ రైతు ఉన్నాడు కాబట్టి ఆ ఫోటో యాజిటీజ్‌గా వాడుకోవడం సాధ్యం కాదు . అందుకే టెక్నాలజీతో ఆలోచించి.. ఆ రైతు ఫోటోను పోటోషాప్ ద్వారా తీసేశారు. ఆ ప్లేస్‌లో మరో దిగువ మధ్యతరగతి యువకుడ్ని తెచ్చి పెట్టారు. అంతే.. తమ టాలెంట్ అద్దిరిపోయిందనుకున్నారేమో … ప్రింటింగ్‌కు పంపించేశారు. ఒకే రోజు వేర్వేరు పత్రికల్లో ఈ ఫోటోలు దర్శనమిచ్చాయి. దాంతో.. ఒక్కసారిగా గగ్గోలు రేగింది. తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలిపోతున్నాయి.
కొద్ది రోజుల కిందట.. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్ల విషయంలోనూ ఇంతే జరిగింది. ఆ యాడ్స్ బాధ్యత తీసుకున్న యాడ్ ఏజెన్సీ… అంతకు ముందు.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించిన రూ. 5రూపాయల భోజనం క్యాంటీన్ లో తింటున్న వారి ఫోటోలను గూగుల్ నుంచి తీసుకుని వాడేశారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా.. పబ్లిసిటీ ప్రారంభించారు. నిజానికి అన్న క్యాంటీన్లలో అంతకంటే.. అద్భుతంగా… అబ్బరంగా పేదలు భోజనం చేస్తున్న ఫోటోలు చాలా బయటకు వచ్చాయి. అవేమీ కాకుండా.. వైసీపీ ఎమ్మెల్యేకు చెందిన క్యాంటీన్లో తింటున్న వారి ఫోటోలతోనే పబ్లిసిటీ చేయడంతో.. విమర్శలు వచ్చాయి.
పైన తెలంగాణ విషయంలో కానీ.. ఇటు ఏపీ విషయంలో కానీ… ప్రభుత్వాల చేతుల్లో ఏమీ లేదు. బాధ్యత లేని … మీడియా ఏజెన్సీలు కోట్లకు కోట్లకు ప్రభుత్వాల వద్ద డబ్బులు తీసుకుని యాంత్రీకంగా పని చేయడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. ప్రభుత్వానికి ప్రచారం తెచ్చి పెట్టాల్సిందిపోయి .. పరువు తీస్తున్నాయి.