చూస్తుండగానే స్టార్ అయిపోయిన నటుల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ఎవడే సుబ్రహ్మణ్యం తో పేరు తెచ్చుకుని, పెళ్లి చూపులతో హీరోగా మారి, అర్జున్ రెడ్డితో స్టార్ అయిపోయాడు. ఇప్పుడు విజయ్ అంటే ఓ క్రేజ్! తనో యూత్ ఐకాన్..! అతన్నుంచి మరో సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. అదే.. ‘గీత గోవిందం’. బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా విజయ్‌తో చేసిన చిట్ చాట్ ఇది.
హాయ్ విజయ్
– హాయ్
చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు..
– అవునండీ.. యేడాది నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా. గత వారం పది రోజుల నుంచైతే… సరిగా నిద్ర కూడా లేదు. సినిమా విడుదలకు దగ్గరపడింది, దానికి తోడు ప్రమోషన్లు. దాంతో… బాగా నీరసించిపోయాను. ఈ సినిమా విడుదలయ్యాక వారం రోజులు… తిండి, నిద్ర తప్ప మరో విషయం ఆలోచించకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాను.
ఇలాంటి ఫేజ్ కోసమే ఇన్నాళ్లూ ఎదురుచూశారు కదా?
– అవును. వర్క్ పరంగా కంప్లైంట్లు ఏమీ లేవు. కానీ.. మరీ ఆరోగ్యం పాడు చేసుకుని మరీ సినిమాలు చేయలేం కదా? అందుకే రెస్ట్ కావాలనుకుంటున్నా.
ఈ స్టార్ డమ్‌ని సరిగానే హ్యాండిల్ చేయగలుగుతున్నారా?
– అరె.. నేనేంటి? నాకొస్తున్న పేరేంటి? అని ఆలోచించుకునేలోగా.. టప టప రోజులు గడిచిపోతున్నాయి. నేనేం ప్లాన్ చేసుకోవడం లేదు. కెరీర్ అలా ముందుకు వెళ్తోంది. నేను దాని వెంట పరుగులు పెడుతున్నాను. ఈ స్థితిలో కాస్త కన్ఫ్యూజన్ సజహంగానే ఉంటుంది. దాన్ని దాటుకుని రావాలి.
ఈ గందరగోళంలో ఎక్కువ తప్పులు చేసేస్తానేమో అనే భయం వేయడం లేదా?
– నా తప్పుకి నేనే బాధ్యుడ్నయితే.. ఓకే. వేరొకరి తప్పులు నామీద పడితేనే ఇష్టం ఉండదు. తప్పులు చేయడం అంటే నాకిష్టం. దాన్నుంచి
చాలా నేర్చుకోవచ్చు కదా?
ఈ సినిమాలో పాట పాడి తప్పు చేశాననిపించిందా?
– అదేం లేదు. నాకు నచ్చే పాడా. పైగా అది సరదా పాట. ఎవరైనా పాడేయొచ్చు. అందుకే ఆ రిస్క్ తీసుకున్నా. 45 నిమిషాల్లో పాట పాడడం పూర్తయిపోయింది. ఓ రోజు టైమ్ తీసుకున్నా.. పాట అలానే వద్దును.
కానీ ఆ పాట గురించి చాలా ట్రోలింగ్ జరిగింది కదా?
– అవును. వాటిని కూడా ఎంజాయ్ చేశాను. `చెత్తగా ఉంది దరిద్రంగా ఉంది` అంటే ఫర్వాలేదు. `ఇక పాటలు పాడడం ఆపేయ్` అంటేనే నచ్చదు.
ఎందుకంటే సలహాలు ఇవ్వడమన్నా, తీసుకోవడమన్నా నాకు నచ్చదు. మా అమ్మానాన్నలు చెబితేనే నేను వినను. ఇక బయటివాళ్లు చెబితే
ఎలా వింటాను?
అర్జున్ రెడ్డితో పోలిస్తే… గీత గోవిందం ఎలా ఉంటుంది?
– రెండింటికీ పోలిక లేదు. ఓ అమ్మాయిని ఓ అబ్బాయి అర్జున్‌రెడ్డిలో ఎంత సిన్సియర్‌గా ప్రేమిస్తాడో, గీత గోవిందంలోనూ అలానే ప్రేమిస్తాడు.
అదొక్కటే పోలిక. కానీ ఆ ప్రేమని సాధించుకోవడానికి ఇద్దరూ ఎంచుకునే మార్గాలు మాత్రం పూర్తిగా వేరు.
సడన్‌గా రాముడు మంచి బాలుడు టైపు పాత్రంటే…
– నిజానికి నాకు ఫ్యామిలీ టైపు సినిమాలు చూడడం ఇష్టం. కానీ చేయడం ఇష్టం ఉండదు. ఇలాంటి స్క్రిప్టు చేస్తానని నేను అనుకోలేదు. బన్నీ వాసు మాత్రం `ఇలాంటి జోనర్లు కూడా ట్రై చేయాలి.. అప్పుడు ఇంకాస్త రీచ్ ఎక్కువ ఉంటుంది` అన్నారు. నాకూ అది నిజమే అనిపించింది.
ఈ సినిమా నుంచి నాకు, నా నటనకు క్రెడిట్ ఏమైనా వస్తే అది పూర్తిగా బన్నీ వాసు, దర్శకుడు పరశురామ్లదే.
విడుదలకు ముందే సినిమాలో కొన్ని సన్నివేశాలు బయటకు వచ్చేశాయి. అది మిమ్మల్ని బాగా హర్ట్ చేసినట్టుంది?
– ఎవరికైనా బాధగానే ఉంటుంది కదండీ? అలా జరక్కుండా ఉండాల్సింది. సినిమాలో అయినా, జీవితంలో అయినా డ్రామా ఉండాల్సిందే. అదో జ్ఞాపకం అనుకుంటా.
మీ తమ్ముడు కూడా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని విన్నాం..
– ఆ సంగతి వాడినే అడగండి. ఎందుకంటే.. నేను వాడి విషయాలు పట్టించుకోను. నా గోల నాది.. నా గొడవ నాది.
టాక్సీవాలా లేట్‌కి కారణమేంటి?
– సీజీ వర్క్‌తో చాలా పని పడింది. ఇప్పటి వరకూ చేసిన సీజీ వర్క్ మాకు నచ్చలేదు. అందుకే మరోసారి చేయిస్తున్నాం. ఎలాంటి హడావుడి పడకుండా సినిమాని రీలీజ్ చేస్తే… తప్పకుండా హిట్టవుతుంది. అందుకే.. ఓపిక పడుతున్నాం.
ప్రొడక్షన్లోకి అడుగుపెడతున్నార కదా?
– (నవ్వుతూ) ఆ విషయాలు ముందే బయటకు వచ్చేశాయా?? త్వరలోనే ఆ సంగతులు చెప్తా..