గీత గోవిందం కోసం విజయ్ దేవరకొండ గాయకుడిగా అవతారం ఎత్తాడు. విజయ్ పాట పాడడం.. ఈ సినిమాకి ఓ కొత్త క్రేజ్ తీసుకొస్తుందనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీనిపై చాలా సెటైర్లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీన్ని విజయ్ కూడా గుర్తించాడు. ఆడియో వేడుకలో…తన తప్పు ఒప్పుకున్నాడు. `మీలో ఎవరైనా ఈ పాట పాడించి పంపండి. బాగుంటే.. గాయకుడిగా ఛాన్స్ ఇస్తాం. నా పాట బదులుగా ఆ ఆపాటే సినిమాలో వినిపిస్తాం` అన్నాడు. మరి ఇప్పుడు విజయ్ పాట ఉంచారా, తీసేశారా? అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే రేపే (బుధవారం) గీతా గోవిందం సినిమా విడుదల అవుతుంది. మరి ఆ పాట మాటేంటి?
దీనిపై క్లారిటీ దొరికేసింది. విజయ్ కి బదులుగా ఓ ప్రొఫెషనల్ గాయకుడితో ఈ పాట పాడించారు. అయితే విజయ్ పాట కూడా అలానే ఉంది. ఓవర్సీస్ ప్రింట్స్లో మాత్రం విజయ్ పాట వినిపిస్తుంది. ఇండియాలో ఆ పాట మరొక గొంతులో వినిపిస్తుంది. విజయ్ ఫ్యాన్స్ చాలామంది వాట్ ద ఎఫ్ పాటని పాడి పంపారట. వాటిలో విజయ్‌కి రెండు గొంతులు బాగా నచ్చాయట. కానీ… సినిమా స్థాయికి తగ్గట్టుగా ఆ పాటలు లేకపోవడంతో.. ప్రొఫెషనల్ గాయకుడితోనే ఆ పాట పాడించేశారు. ఓవర్సీస్ ప్రింట్లు త్వరగా వెళ్లిపోతాయి కాబట్టి.. విజయ్ పాడిన పాటని మార్చే ఛాన్స్ రాలేదని తెలుస్తోంది. సో.. ఓవర్సీస్లో విజయ్ గొంతుతో వినిపించిన పాట, ఇక్కడ మరొకరి గొంతు నుంచి వినిపిస్తుందన్నమాట.