ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది అందరికీ తెలిసిందే! ఈ మధ్యనే నాయకులు కొంత హడావుడి మొదలుపెట్టినా… ఇప్పటికిప్పుడు అనూహ్యంగా పార్టీ పుంజుకుంటుందనే నమ్మకం ఆ పార్టీ నాయకులకు లేదన్నది వాస్తవం. అయితే, పార్టీని దీర్ఘకాలిక ప్రాతిపదికనైనా బలోపేతం చేసుకోవాలి కాబట్టి… నేతలను దగ్గరకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపాలని భావిస్తున్నారు. అయితే, ఆంధ్రాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విషయమై రాహుల్ చేసిన వ్యాఖ్య.. ఏపీ నేతలకు కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తోందట..!
హైదరాబాద్ లో మీడియా ప్రముఖులతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు జవాబు చెబుతూ… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రాలో పరిస్థితి ఏంటనే ప్రశ్నపై స్పందిస్తూ… ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదనీ, కానీ బలపడటం ఖాయమని చెప్పారు. పొత్తుల విషయమై కూడా మాట్లాడుతూ… ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోవాలనేది స్థానిక నేతల నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రాలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని రాహుల్ గాంధీ చెప్పడంతో ఆ పార్టీ నేతలు కొంత డీలా పడ్డట్టు సమాచారం! ఎందుకంటే, కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా మీదే తొలి సంతకం అంటూ ప్రచారం పెంచడంతో… ఆంధ్రాలో కొంత గుర్తింపు వస్తోందన్నది ఏపీ కాంగ్రెస్ వర్గాల నమ్మకం! ఇదే క్రమంలో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవ్వాల్సిన హామీలపైనా కొంత కసరత్తు ప్రారంభించారట! రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఏం చేయబోతోందనేది ప్రజలకు వివరించడానికి సిద్ధమౌతున్న ఈ తరుణంలో… ఆ అవకాశమే లేదని రాహుల్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కొంత ఇబ్బందికరమే అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది!
నిజమే కదా, అన్ని పార్టీలూ అధికారం కోసమే ఎన్నికలకు వెళ్తాయి. ఆంధ్రా విషయానికొస్తే… గట్టిగా క్షేత్రస్థాయి నిర్మాణం లేని పార్టీలు కూడా అధికారంలోకి వస్తామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి. అలాంటిది, ఎన్నోయేళ్లుగా ఆంధ్రాలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ… ఎన్నికలకు ముందే అధికారంలోకి రాలేమన్న ముద్రను వేయించుకోవడం సరికాదన్నది కొందరి అభిప్రాయం! ఏదేమైనా, రాహుల్ గాంధీ వాస్తవాన్ని అంగీకరించారనీ అనుకోవచ్చు కదా!