కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన రాష్ట్ర పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పొచ్చు! మహిళలు, నిరుద్యోగులు, సెటిలర్లు, పేదలు… వీళ్లని లక్ష్యంగా చేసుకునే రాహుల్ గాంధీ రెండ్రోజుల పర్యటన సాగింది. తెలంగాణలోని తెరాస, కేంద్రంలోని భాజపా సర్కారును దాదాపు ఒకే గాటన కట్టి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, కేంద్రంలో మోడీ పాలన ఒకే విధంగా ఉన్నాయన్నారు. ఇద్దర్నీ రీడిజైనర్లు అంటూ ఎద్దేవా చేశారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ఆత్మ విశ్వాసం మరింత పెరిగినట్టుగా కనిపించింది. మోడీ సర్కారుపై చాలా సూటిగా స్పష్టంగా బలమైన విమర్శల్నే ఎక్కుపెట్టగలిగారు. నోట్ల రద్దు నిర్ణయం వైఫల్యం, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ జీఎస్టీని విమర్శించడం, బ్యాంకులకు టోకరా వేసిన వారి విషయంలో మోడీ సర్కారు చర్యల వైఫల్యం, రాఫెల్ యుద్ధ విమానాల డీల్… ఈ అంశాలపై సాధికారికంగానే విమర్శలు చేయగలిగారు.
ఇక, తెలంగాణ విషయానికొస్తే… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంపై కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుందని రాహుల్ పర్యటన ద్వారా తేటతెల్లమైంది. ఏదో వచ్చామా, నాలుగు సభల్లో పాల్గొన్నామా, వెళ్లిపోయామా అన్నట్టుగా కాకుండా… తెలంగాణపై చాలా కాంగ్రెస్ కు చాలా ఆశలున్నాయన్నట్టుగా రెండ్రోజుల టూర్ సాగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాబోయే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటుందనే స్థాయిలో రాహుల్ బాగా నమ్మకంతో ఉన్నట్టుగా, దాని కోసం ఏదో చెయ్యాలన్నట్టుగా ఆయనలో కమిట్మెంట్ కనిపించింది. కర్ణాటకలో తాము ఇచ్చిన హామీలు అమలు చేశామనీ, ఆచరణ సాధ్యం కానివి తాను మాట్లాడను అంటూ ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనలో రాహుల్ చాలా చురుగ్గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాబోతున్నామనీ, కావాలంటే బెట్ అంటూ మీడియా సమావేశంలో మాట్లాడారు.
పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ ఇచ్చిన పార్టీని అధికారంలోకి తేవడానికి తాను చేయాలనుకుంటున్నవి రాహుల్ గాంధీ చెప్పేశారు. కానీ, వీటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర నేతలపై ఉంటుంది. మహిళలు, నిరుద్యోగులు, సీమాంధ్రులు… వీరందరినీ ఆకర్షించే ప్రయత్నం రాహుల్ చేశారు. వీరితో రాష్ట్ర నేతలు ఏ స్థాయిలో మమేకం కాగలరనేదే ప్రశ్న? ఇప్పటికే రాష్ట్ర నాయకుల్లో ఆధిపత్య పోరు కావాల్సినంత ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ ఆశయాల్నీ, ఆశల్నీ ఎవరు భుజాన వేసుకుని వెళ్లాలనే అంశమ్మీద కాంగ్రెస్ నేతల్లో సమన్వయం కుదరడమే ఒక సమస్యగా కనిపిస్తోంది. తెలంగాణలో కొంత కష్టపడితే పార్టీకి మంచి అవకాశాలున్నాయనే నమ్మకం జాతీయ నాయకత్వానికి బాగా ఏర్పడిందన్నదని చెప్పుకోవచ్చు. రాహుల్ పర్యటన తరువాత… ఈ స్ఫూర్తి రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై ఏరకంగా పని చేయించగలుగుతుందనేది వేచి చూడాలి.