రకుల్ ప్రీత్‌సింగ్… తెలుగులో అగ్ర కథానాయిక. ఇప్పుడామె తమిళంలో ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు. అలాగే, ఓ హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు. రకుల్‌కి తమిళ, హిందీ భాషల్లో అగ్ర కథానాయకుల చిత్రాల్లో అవకాశాలు రావడానికి కారణం తెలుగు చిత్రసీమే. తెలుగు ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ సీమ ఆమెకు అగ్ర తాంబూలం ఇవ్వడంతో మిగతా భాషల్లో అవకాశాలు సులభంగా వచ్చాయి. రకుల్ తమ్ముడు అమన్ కూడా అక్క బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. నటుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే… తమ్ముణ్ణి తెలుగులో కాకుండా హిందీలో పరిచయం చేస్తున్నారు రకుల్. ప్రస్తుతం ‘రామరాజ్య’ అనే చిత్రంలో అమన్ నటిస్తున్నాడు. జార్ఖండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తెలుగులో సిస్టర్ స్టార్ అయితే… హిందీలో బ్రదర్ బడ్డింగ్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నాలు చేస్తున్నాడన్నమాట!
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’ సినిమాల ఫేమ్ మెహరీన్ బ్రదర్దీ సేమ్ టు సేమ్ సీన్. అయితే… రకుల్ తమ్ముడి కంటే మెహరీన్ తమ్ముడికి మంచి అవకాశం వచ్చింది. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ హీరోలుగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్‌జోహార్ నిర్మిస్తున్న భారీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’లో మెహరీన్ తమ్ముడు గురుఫతే నటిస్తున్నాడు. తెలుగులో సిస్టర్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే హిందీలో చక్కటి అవకాశాన్ని అందుకున్నాడు. ఉత్తరాదిలో హీరోయిన్లుగా నటిస్తున్న వీళ్ల తమ్ముళ్లు హిందీలోకి వెళ్తున్నారేంటో? అక్కడ ఒకట్రెండు సినిమాలు చేశాక… ప్రతినాయకుడి పాత్రలతో తెలుగులోకి వస్తారంటారా? చూద్దాం! తెలుగులో ప్రతినాయకులుగా నటించాలనుకునే హిందీ నటులకు ఎప్పుడూ అవకాశాలకు లోటు వుండదు!!