సాధారణంగా హీరోయిన్స్ సిస్టర్స్ హీరోయిన్స్‌గా వస్తుంటారు. కజిన్స్ రావడం మాత్రం తక్కువే. హిందీలో ప్రియాంకా చోప్రా పెద్ద హీరోయిన్. ఇండస్ట్రీలోకి ఆమె వచ్చిన కొన్నాళ్ళకు పరిణితీ చోప్రా హీరోయిన్గా వచ్చారు. అలా తెలుగులోకి ఓ హీరోయిన్ కజిన్ వస్తున్నారు. తెలుగులో అనూ ఇమ్మాన్యుయేల్ పెద్ద హీరోయిన్ కాకపోవచ్చు. కానీ, ప్రేక్షకుల్లో గుర్తింపు వున్న హీరోయిన్. ఇప్పుడామె కజిన్ హీరోయిన్గా వస్తున్నారు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించనున్న సినిమా ‘జెర్సీ’. ఇందులో నానికి జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ కజిన్ రెబ్బా మోనికా జాన్ని ఎంపిక చేశారు. తమిళంలో రెండు, మలయాళంలో రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రెబ్బాకు తెలుగులో ఇదే తొలి సినిమా. అనూ ఇమ్మాన్యుయేల్ తెలుగులో అంగీకరించిన మొదటి సినిమా ‘ఆక్సీజన్’ అయినప్పటికీ… విడుదలైంది మాత్రం ‘మజ్ను’ సినిమాయే. అందులో నాని హీరో. ఆమె కజిన్ కూడా నాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతుండటం యాదృశ్చికం అనుకోవాలేమో. క్రికెట్ నేపథ్యంలో ‘జెర్సీ’ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘దేవదాస్’ పూర్తయిన తరవాత ‘జెర్సీ’ ప్రారంభం కానుంది.