గీత గోవిందం చిత్రానికి సూపర్ హిట్టు టాక్‌రావడం, ప్రశంసల వర్షం కురుస్తుండడం దర్శకుడు పరశురామ్ ఆనందం ఎవరెస్టు స్థాయికి తాకింది. అయితే… ఇంతలోనే చిన్న గందరగోళం. ఎప్పుడో తీసుకున్న అడ్వాన్స్ ఇప్పుడు గుది బండగా మారింది. శ్రీరస్తు శుభమస్తు తరవాత.. మంచు విష్ణుతో ఓ సినిమా చేద్దామనుకున్నాడు పరశురామ్. రూ.25 లక్షలు అడ్వాన్స్‌కూడా తీసుకున్నాడు. విష్ణు బిజీ వల్లో, లేదంటే కథ కుదరకపోవడం వల్లో ఆ ప్రాజెక్టు అలా ఆగిపోయింది. పరశురామ్ అడ్వాన్స్ కూడా వెనక్కి ఇవ్వలేదు. మరోవైపు విష్ణు కూడా సినిమా ఊసెత్తలేదు. `గీత గోవిందం` సూపర్ హిట్టు అయిపోయేసరికి మంచు ఫ్యామిలీ రంగంలోకి దిగిపోయింది. `అప్పుడు అడ్వాన్సు తీసుకున్నావ్ కాబట్టి. ఇప్పుడు సినిమా చేయాల్సిందే` అంటూ హడావుడి చేయడం మొదలెట్టారు.
నిజానికి `గీత గోవిందం` తరవాత పరశురామ్ పెద్ద హీరోలకు గాలం వేసే పనిలో ఉన్నాడు. తనకి అలాంటి అవకాశాలూ వస్తున్నాయి. అల్లు అర్జున్‌తో సినిమా చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఈ దశలో ఎప్పుడో తీసుకున్న అడ్వాన్స్ పరశురామ్ ముందర కాళ్లకు బంధం వేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విష్ణుతో సినిమా చేయడం పరశురామ్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ.. అడ్వాన్స్‌తీసుకున్నందుకు చేయకతప్పదు. ఈ ప్రాజెక్టులోంచి ఎలాగైనా బయటకు రావాలని పరశురామ్ తాపత్రయపడుతుంటే., పరశురామ్‌తో ఎలాగైనా సినిమా చేయాలని మంచు ఫ్యామిలీ పావులు కదుపుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.