ఈమధ్య వెన్నెల కిషోర్… పించ్ హిట్టర్ పాత్రని అద్భుతంగా పోషిస్తున్నాడు. సినిమా చివర్లో రావడం.. ఫట ఫట నవ్వించడం… క్రెడిట్ అంతా భుజాన వేసుకుని వెళ్లడం – కిషోర్ఫామ్ ఇలానే సాగుతోంది. చిలసౌ,గూఢచారిలో బాగా నవ్వించాడు వెన్నెల కిషోర్. `గీత గోవిందం`లో అయితే ఇక చప్పక్కర్లెద్దు. క్లైమాక్స్ ముందొచ్చి.. విజృంభించేశాడు. ఈ సినిమా ఇంత ప్లజెంట్ గా `శుభం` కార్డు వేసుకోవడానికి తానూ ఓ ప్రధాన కారణమయ్యాడు. త్వరలో రాబోతున్న `శైలజా రెడ్డి అల్లుడు` సినిమాలోనూ వెన్నెల కిషోర్ కామెడీనే ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని సమాచారం. ఈ సినిమాలో చివర్లో రాడు గానీ.. మొదట్నుంచీ నాగచైతన్య పక్కనే ఉంటూ సెటైర్లు వేస్తుంటాడట. చైతూ పెద్దగా కామెడీ చేయలేడు. నాని, విజయ్ దేవరకొండలా కామెడీ టైమింగ్ లేదు. అందుకే.. మారుతి ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ని వాడుకున్నాడట. నాగచైతన్య కనిపించే ప్రతీ సీన్లోనూ వెన్నెల కిషోర్‌నీ పక్కన పెట్టి నవ్వులు పంచాడట. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వెన్నెల కిషోర్ మరోసారి.. థియేటర్ని నవ్వుల్లో ముంచెత్తబోతున్నాడట. ఓ రకంగా ఈ సినిమాకి ఓ మూలస్థంభంగా నిలవబోతున్నాడట. కిషోర్ బాగా నవ్వించిన సినిమాలన్నీ హిట్టే. దానికి తోడు మారుతికి కూడా మంచి కామెడీ సెన్స్ ఉంది. సో.. శైలజా రెడ్డి అల్లుడికి అది బాగా కలిసొచ్చే అవకాశాలున్నాయి.