‘గీత గోవిందం’ విడుదలైంది! విజయం సాధించింది! దాంతో విడుదలకు మందు విపరీతంగా చర్చ జరిగిన పైరసీ సమస్య పక్కకు వెళ్లింది. ప్రేక్షకుల్లో ఎవరూ పైరసీ ఊసు ఎత్తడం లేదు. కానీ, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ‘గీత గోవిందం’ సమస్యను పరిష్కరించే సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాల గురించి చర్చ జరుగుతోంది. తెలుగు సినీ ప్రముఖులు అంతర్గత విచారణ జరుపుతున్నారు. గుంటూరులో ‘గీత గోవిందం’ పైరసీ చేసినందుకు కొందరు విద్యార్థులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో వెలుగులోకి వచ్చిన కొన్ని సంచలన నిజాలు విని సినీ ప్రముఖులు విస్మయం వ్యక్తం చేస్తున్నార్ట! గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని కాలేజీల విద్యార్థులకు విడుదలకు ముందే కొత్త సినిమాల వీడియోలు సంపాదించి చూడటం ఒక అలవాటుగా మారిందని తెలుస్తోంది. స్నేహితురాళ్లకు చూపించటం వాళ్లకు సరదా. సరదాల కోసం విద్యార్థులు చందాలు వేసుకుని మరీ విడుదలకు ముందు పైరసీ సీడీలు సంపాదిస్తున్నార్ట! ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలు మాత్రమే కాదని, విడుదలకు సిద్ధమవుతోన్న మరో నాలుగైదు సినిమాల్లోని సన్నివేశాలు విద్యార్థుల చేతికి చిక్కాయట! చిత్ర పరిశ్రమలోని ఇంటి దొంగలు కాసుల కోసం కక్కుర్తి పడి సినిమా ఫలితాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి చిత్ర పరిశ్రమ పెద్దలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నడుం బిగించారని తెలుస్తోంది. విడుదలకు ముందు సినిమా చూడటం, పైరసీ చేయడం దొంగతనం కిందకే వస్తుందని ఇటీవల సినిమా పెద్దలు చెప్పిస విషయం గుర్తుండే వుంటుంది. ఈ దొంగతనాలకు మూల కారణమైన ఇంటి దొంగల ఆట కట్టించాలని తెలుగు చిత్ర పరిశ్రమ గట్టిగా నిర్ణయించుకుంది.