మంగళగిరి వద్ద నిర్మిస్తున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెట్టాలని కేంద్రానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిఫార్సు చేశారు. అనూహ్యంగా చంద్రబాబు చేసిన ఈ సిఫార్సు రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే..ఎయిమ్స్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్. భూమి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఆ ప్రకారం మంగళగిరి వద్ద నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ కి పేరు పెట్టే విషయంలో…. కేంద్రం ఏమైన ఆలోచన చేసిందో లేదో కానీ.. అడ్వాంటేజ్ మాత్రం చంద్రబాబు తీసేసుకున్నారు. ఇప్పుడు కేంద్రం…. చంద్రబాబు సిఫార్సుపై… వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.
నిజానికి అధికారంలో ఉన్న పార్టీకి పిల్లర్లుగా ఉన్న నేతలు మరణిస్తే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు… వారి పేర్లు పెడుతూ గౌరవిస్తూ ఉంటారు. అలా చేస్తే… వారిని గౌరవించినట్లుగా ప్రజలు భావిస్తారనుకుంటారు. వైఎస్ చనిపోయినప్పుడు.. మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్ ల దగ్గర్నుంచి…. పెద్ద పెద్ద యూనివర్శిటీల వరకూ ఆయన పేర్లు పెట్టేశారు. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చి.. ప్రజల సెంటిమెంట్లను క్యాష్ చేసుకుందామనుకున్నారు కూడా. అంతిమంగా అవన్నీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కాకుండా… కాంగ్రెస్ ను చీల్చి.. సొంత పార్టీ పెట్టుకున్న జగన్ కు బాగా ఉపయోగపడ్డాయి.
ఈ పేర్ల రాజకీయంలో చంద్రబాబు చురుగ్గా ఆలోచించారు. ఎయిమ్స్ .. పూర్తిగా కేంద్ర నిధులతో కడుతున్న ప్రాజెక్ట్ కాబట్టి.. ఏపీ ప్రభుత్వం అవునన్నా… తమ నేతల పేర్లే పెడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలా పెట్టినప్పుడు వ్యతిరేకించక తప్పని పరిస్థితి టీడీపీకి ఏర్పడుతుంది. తెలుగు ప్రముఖుల పేర్లే పెట్టాలని ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. నేరుగా వాజ్‌పేరు పెట్టక తప్పని పరిస్థితి కేంద్రానికి కల్పించారు. భారతరత్న వాజ్ పేరు ఎయిమ్స్ కు పెట్టకపోతే… అటల్ పై బీజేపీకి గౌరవం లేదన్న అభిప్రాయం ఏర్పడుతుంది. పెడితే చంద్రబాబుకు క్రెడిట్ వస్తుంది. అంటే ఈ నేమ్ గేమ్‌లో అంతిమ విజేత మాత్రం చంద్రబాబే అవుతారన్నమాట.