ఎగువరాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన డ్యాముల్లో గరిష్టంగా నీరు చేరుతోంది. ముఖ్యంగా కృష్ణమ్మ పరవళ్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల ఏడాదిలో ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. ప్రస్తుతం ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి దాదాపుగా 3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇది వారం రోజుల పాటు ఉంటుందని… కేంద్ర జలసంఘం అంచనా వేసింది. ఇదే జరిగితే… శ్రీశైలం మాత్రమే కాదు.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కూడా నిండుతుంది. అది నిండితే… ఏపీలోని పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాల్లోని ఆయుకట్టుకూ నీరందుతుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకూ నీరందుతుంది. గత నాలుగేళ్ల కాలంలో… ఈ ఆయుకట్టుకు సాగర్ నుంచి నీరందలేదు. కానీ కీలకమైన ఎన్నికల ఏడాదిలో నీరందించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కచ్చితంగా ఇది తమ ఘనతగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటాయి. రైతుల్లోనూ సానుకూల భావన ఏర్పాడుతుంది.
తెలంగాణలో గోదావరిపై ఉన్న చిన్న మధ్యతరహా ప్రాజెక్టుల్లోనూ నీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్ లో ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి కూడా నీరు వస్తూండటంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయాలంటూ.. కాకతీయ కాలువ కింద పంటలు సాగు చేసుకుంటున్న రైతులు చాలా రోజులుగా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళ కారణంగా… 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్న నీటిని మిషన్ భరీరథ కోసం వాడాలనుకున్న ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ లోకి నీరు వచ్చి చేరుతూండటంతో.. నీటి విడుదలకు ప్రణాళిక సిద్దం చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.
నిజానికి పంటల సీజన్ ప్రారంభమయ్యి.. కాక ముందే ఏపీలో కరువు రాజకీయాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో కరువు గురించి పట్టించుకోవడం లేదంటూ… బీజేపీ నేతలు విమర్శలు చేశారు. యాత్రలకూ సిద్ధమయ్యారు. ఇక శ్రీశైలంలో నీళ్లున్నా… ఇవ్వడం లేదంటూ… రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఆందోళనలు ప్రారంభించారు. సాక్షి పత్రికలో ప్రతీ రోజూ… కరువు కథలు కనిపించడం ప్రారంభించాయి. ఇలాంటి సమయంలో పరిస్థితి మారిపోయింది. వర్షాలతో పాటు ఎగువ నుంచి వరద నీరు కూడా వస్తోంది. పోతిరెడ్డిపాడు నుంచి ఏకంగా 26 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోంది. హంద్రీనీవాకూ గరిష్ట స్థాయిలో విడుదల చేస్తున్నారు. అంటే.. ఇక ఏపీలో కరవు రాజకీయం ఉండదని అనుకోవచ్చు.
ఏ విధంగా చూసినా ఎన్నికల ఏడాదిలో…. తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు శుభ సూచకమే. అయితే దండిగా పొలాలకు నీరు అందిస్తున్న ప్రభావం.. రైతుల్లో సంతోషాన్ని నింపుతుంది కానీ… మరో రకంగా అసంతృప్తి పెరగడానికి అవకాశం ఉంది. దండిగా నీరందడంతో భారీగా పంట చేతికొస్తుంది. వాటికి సరైన మద్దతు ధరలు లభించకపోతే.. మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఏపీ ప్రభుత్వానికే ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి పరిస్థితి రాక ముందే… ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారు మరి..!