తమ ప్రతినిధి ద్వారా ఓటు వినియోగించుకునే హక్కును… ప్రవాస భారతీయులకు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య సవరణ బిల్లు–2017ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. సైలెంట్ గా ఆమోదింపచేసుకున్నారు. కానీ రాజ్యసభలో మాత్రం పెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకూ ప్రాగ్జీ ఓటింగ్ అవకాశం రక్షణ సిబ్బందికి మాత్రమే ఉంది. 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణ ప్రకారం విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో ‘ఓవర్సీస్ ఎల క్టర్స్’గా తమ పేర్లను నమోదు చేసుకునే చాన్స్ ఉంది. కొత్త బిల్లు ఆమోదం పొందితే ఎంతో మంది ప్రవాస భారతీయులకు మన దేశంలో నిర్వహించే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారికి ‘ప్రాగ్జీ’ఓటింగ్ ఉపయోగకరం. గల్ఫ్ మినహా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఇతర విదేశాల్లో ఉపాధి పొందుతున్న వారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఆ దేశ పౌరసత్వం లభించే అవకాశం ఉంది. ఒక్క గల్ఫ్ దేశాల్లో మాత్రం విదేశీయులకు పౌరసత్వాన్ని ఆ దేశాలు ఇచ్చే అవకాశం లేదు.
’ప్రాగ్జీ ఓటింగ్’ సౌకర్యం ద్వారా సుమారు కోటీ 50 లక్షల మంది ఎన్నారైలు భారత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నారైలను పట్టించుకోవాల్సిన అవసరం అనివార్యమైంది. అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న సుమారు 10 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు 25 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలరు. ఒక్కో గల్ఫ్ ఎన్నారైకి కుటుంబ సభ్యులందరు కలిపి కనీసం ఐదుగురు ఉంటారు. అంటే గల్ఫ్ ప్రవాసులు వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 60 లక్షల మందితో ‘గల్ఫ్ ఓటు బ్యాంకు’ రూపు దిద్దుకుంటుంది.
వీరు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ప్రవాస భారతీయులకు హక్కులు కల్పించేందుకు, సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ పార్టీలు తమ మెనిఫెస్టోలో పేర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రవాస భారతీయుల పేరిట ఉన్న భూములకు పెట్టుబడి సహాయం అందించలేదు. కానీ పరోక్ష పద్ధతిలో ఎన్నారైలకు ఓటు హక్కు లభించడం వల్ల ప్రభుత్వం తన ఆలోచన తీరును మార్చుకునే అవకాశం లేకపోలేదు.