ఎన్నికలకు ముందుగా అభ్యర్థులను ప్రకటించడం అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆనవాయితీ. నామినేషన్లకు కొద్దిరోజుల ముందు జాబితా విడుదల చేస్తుంటారు. కానీ, 2019 అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే మంచిదనే అభిప్రాయం పార్టీలో కొంత బలంగా వినిపిస్తోందట! ప్రతిపక్ష పార్టీ వైకాపా బలంగా ఉన్న నియోజక వర్గాల్లో వీలైనంత ముందుగానే టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా… అక్కడ పార్టీ కార్యకలాపాల్లో మరింత జోష్ వస్తుందనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. దీన్లో భాగంగానే కనీసం దాదాపు నలభై మంది అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేసే కసరత్తు టీడీపీలో జరుగుతోందని కథనాలు వినిపిస్తున్నాయి.
టీడీపీ టిక్కెట్ కోసం కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన పోటీ ఉంది. చాలామంది ఆశావహులున్నారు. ఇలాంటి స్థానాల్లోముందుగానే అభ్యర్థుల ఎంపిక చేస్తే… అసంతృప్తులు తగ్గుతాయనీ, ఆశావహుల్ని బుజ్జగించేందుకు సమయం ఉంటుందనేది టీడీపీ అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే, నాణానికి మరోవైపు అన్నట్టుగా… ఇప్పట్నుంచే అభ్యర్థులు ఖరారు చేయడం పార్టీకి ఇంకోరకంగా ఇబ్బంది అయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటికే, వైకాపా నుంచి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలున్నారు. వారందరికీ సీట్లు ఇవ్వాల్సిన అనివార్యత కనిపిస్తోంది. అలాగని,, ఫిరాయింపుదారుల విషయంలో ముందుగానే సీట్ల కేటాయింపు జరిగిపోయిందన్న లీకులు ఇవ్వడమూ పార్టీకి ఇబ్బందే! ఎందుకంటే, పార్టీలో ఉన్నవారికంటే… వైకాపా నుంచి వచ్చినవారికే ముందస్తు ప్రాధాన్యత అనే అభిప్రాయమూ మంచిది కాదు.
ఇక, అసంతృప్తుల విషయానికొస్తే… ఆశించేవారందరికీ టిక్కెట్లు దక్కవు. ఆశావహుల్లో అసంతృప్తి అనేది ఏదో ఒక స్థాయిలో పార్టీ ఎదుర్కోవాల్సిన పరిస్థితే! కానీ, నామినేషన్లకు ముందు టిక్కెట్లు ప్రకటించడం వల్ల.. అప్పటికి కొద్దిరోజులే ఎన్నికలు ఉంటాయి కాబట్టి… అసంతృప్తులను మేనేజ్ చేసుకోవడం కొంత ఈజీగా ఉంటుంది. ఆ అసంతృప్తులు వ్యతిరేకతగా మారి… ఓటింగ్ ను ప్రభావితం చేసే స్థాయికి వెళ్లేలోపుగానే ఎన్నికలు జరిగిపోయే పరిస్థితి ఉంటుంది. అదే, ఎన్నికలకు కొన్ని నెలలు ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే… ఇప్పుడూ అసంతృప్తులు తప్పవు. కానీ, వీటిని ప్రతిపక్షం మరింత అడ్వాంటేజ్ గా మార్చుకునే పరిస్థితి ఉండే అవకాశాలు ఎక్కువ.
ఇంకోటి… ఇప్పుడో నలభై స్థానాలపై క్లారిటీ ఇచ్చేస్తాం, ఆ తరువాత మిగతా టిక్కెట్ల ప్రకటన ఉంటుందనేది కూడా కొంత ఇబ్బందికరమైందిగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షం బలంగా ఉందనుకున్న స్థానాల్లో పార్టీపరంగా కార్యకలాపాలు పెంచుకోవాలి. అంతేగానీ.. అభ్యర్థిని ప్రకటిస్తే తప్ప బలోపేతానికి ఆస్కారం ఉండదనే పరిస్థితి ఉండదు కదా. ఏదేమైనా.. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు అనేది టీడీపీకి పెద్ద సవాల్ గా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి.