తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత కేటీఆర్ కి లేదనీ, ఆయన వాడుతున్న పదజాలం సరైంది కాదన్నారు. ట్విట్టర్ లో ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తుంటారనీ, కాంగ్రెస్ హైకమాండ్ కి శిక్షణ ఇస్తా అంటూ పెద్ద మాటలు చెబుతున్నారన్నారు. శిక్షణ తీసుకోవాల్సింది కేటీఆర్ అనీ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ అతి పెద్ద పార్టీ అనీ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ అనీ వీహెచ్ అన్నారు. ‘మీ నాయినకు కూడా మేమే శిక్షణ ఇచ్చినం, కావాలంటే ఇంటికెళ్లి అడిగి తెలుసుకో’ అని వీహెచ్ వ్యాఖ్యానించారు.
ఈ తిట్ల పురాణాన్ని ఇంకా కొనసాగిస్తూ పోతే కేటీఆర్ కి బూతు సాహిత్య అవార్డు ఇస్తామన్నారు! అది కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఇప్పిస్తామన్నారు. ‘మా పవన్ కల్యాణ్ కి తెలంగాణ అంటే చాలా ఇష్టమట. ప్రేమ అట, అందులోనూ కేటీఆర్ మీద ఆయనకి ఎక్కువ ప్రేముంది’ అన్నారు. పవన్ కల్యాణ్ ఇంటికి తాను వెళ్తాననీ, కేటీఆర్ కి అవార్డు ఇవ్వు అని పిల్చుకొస్తా అన్నారు! మంత్రి లోకేష్ గురించి కూడా పవన్ మాట్లాడతారనీ, ఆయనేమీ చెయ్యలేడని చెప్తారనీ, తెలంగాణలో మంత్రి కేటీఆర్ తరహాలో ఆయన రాజకీయాల్లోకి రాలేదని అంటారని వీహెచ్ వ్యాఖ్యానించారు. తండ్రి చాటున రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయిపోయారని విమర్శిస్తారన్నారు. అదే సమయంలో కేటీఆర్ ని వెనకేసుకొస్తారనీ.. అలాంటప్పుడు, కేటీఆర్ కి కూడా పవన్ నాలుగు మంచి మాటలు చెప్పాలన్నారు! ఆయన భాషను మార్చుకోవాలని పవన్ సూచించాలనీ, కనీసం బూతు సాహిత్య అవార్డు ఇవ్వడం ద్వారానైనా కేటీఆర్ కి బుద్ధొచ్చే అవకాశం ఉంటుందన్నారు!
మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేస్తూనే… పవన్ కల్యాణ్ పై వీహెచ్ బాగానే సెటైర్లు వేసినట్టుగా అనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ పై చేస్తున్న విమర్శల్ని కూడా పరోక్షంగా తిప్పికొట్టినట్టుగా కూడా వీహెచ్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం! ఇవాళ్లే కాదు.. ఇలా పరోక్షంగా టీడీపీకి మద్దతు పలికే విధంగా గతంలో కూడా వీహెచ్ మాట్లాడారు. ఆ మధ్య, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి తిరుపతిలో టీడీపీ కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమైతే, వీహెచ్ మద్దతుగా మాట్లాడారు. టీడీపీని భాజపా మోసం చేసిందనీ, కేంద్రం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షలకు వీహెచ్ మద్దతు పలికిన సందర్భమూ ఉంది. ఇప్పుడు, ఇలా పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూనే… కేటీఆర్ మీద విమర్శలు గుప్పించడం విశేషమే!