ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని.. పింగళి రాశారేమో కానీ.. అసలు ఈ మాటలను.. రాజకీయ నేతల మాటలకు అర్థాలే వేరులే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే.. ఎవరైనా పార్టీ మారుతున్నారని ప్రచారం జరగగానే… అత్యంత వేగంగా ఖండించే రాజకీయ నేతలే ముందుగా పార్టీ మారిపోతారు. అలాగే ఇప్పుడు ట్రెండ్.. ముందస్తు ఎన్నికలు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని.. బీజేపీ అగ్రనాయకత్వం పదే పదే ప్రకటనలు చేస్తూ ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా పనులు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి మరోసారి బయటకు వచ్చింది.
రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం… ఓటర్ల జాబితాలకు సంబంధించిన ఓ క్లారిటీని ఇచ్చింది. జనవరి ఒకటో తేదీ వరకూ… ఓటర్ల జాబితాల సవరణ ఉంటుందని దాని సారాంశం. దాన్ని చూసి అందరూ… ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని.. ఈసీ క్లారిటీతోనే ఉందని డిసైడయ్యారు. ఈసీ ఎలాగూ కేంద్రం జేబులో సంస్థే కాబట్టి.. అలాంటి సూచనలు వచ్చి ఉండబట్టే ప్రకటన చేసి ఉంటారని అనుకున్నారు. అయితే.. ఇలా ఆ ప్రకటన వచ్చి 48 గంటలకు కాక ముందే వెంటనే తూచ్.. అనే ప్రకటన ఈసీ నుంచి వచ్చేసింది. దాని సారాంశం… ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే.. దాని ప్రకారం.. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఉంటుందని… ఒక్క రోజుకే ఇలా ఈసీ ఎందుకు నాలుక మడతేయాల్సి వచ్చిందంటే… మళ్ళ్లీ కేంద్రం నుంచి.. ముందస్తు ఎన్నికలపై స్పష్టమైన సూచనలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
నిజానికి ఈసీ కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా లేమని ప్రకటిస్తూ వస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం… ఈవీఎంలకు వీవీ ప్యాట్ మిషన్లు అమర్చాల్సి ఉందని.. కానీ వాటిని ఇప్పటికప్పుడు సమకూర్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి.. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా లేమని చెబుతోంది. కానీ విచిత్రంగా తన విధానాన్ని ఈసీ పదే పదే మార్చుకుంటోంది. అయితే ఈ క్లారిటీ లేకపోవడం.. ఈసీలోనా.. లేక… కేంద్ర ప్రభుత్వంలోనా అన్నదానిపై… ఎవరికీ స్పష్టత లేదు.