టాలీవుడ్‌కి కొత్తగా పుట్టిన స్టార్ .. విజయ్ దేవరకొండ. వరుస సూపర్ హిట్లతో చెలరేగిపోతున్నాడు. `నోటా`తో తమిళంలోనూ అడుగుపెట్టాడు. `గీత గోవింద` తరవాత తన పారితోషికం మరింత పెరగడం ఖాయం. మరోవైపు విజయ్ వ్యాపారం కూడా బాగానే సాగుతోంది. `రౌడీ` పేరుతో విజయ్ వస్త్రాల బ్రాండింగ్ చేస్తున్న సంగతి తెలిసింది. బొటిక్ తరహాలో సాగుతున్న ఈ వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయలుగా సాగుతోంది. వివిధ దేశాల నుంచి వస్త్రాల్ని దిగుమతి చేసి, బెంగళూరులో డిజైనింగ్ చేసి దింపుతున్నాడు విజయ్. ప్రతీ బుధవారం ఓ కొత్త మోడల్ని ప్రవేశ పెడుతుంటే.. వచ్చిన స్టాకంతా 40 నిమిషాల్లోనే పూర్తయిపోతోందట. దాంతో ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని విజయ్ నిర్ణయం తీసుకున్నాడు. “నాకు చిన్నప్పటి నుంచీ డ్రస్సింగ్ అంటే ఇష్టం. ఫారెన్ నుంచి కూడా నా కాస్ట్యూమ్స్‌ని దిగుమతి చేయించుకుంటుంటా. నా అభిరుచి తగ్గట్టు రౌడీ పేరుతో బ్రాండింగ్ చేస్తున్నా. స్పందన చాలా బాగుంది. నా ఆడియో ఫంక్షన్లకు అభిమానులు కొంతమంది నా తరహా వస్త్రధారణతో రావడం నన్ను మరింత ఉత్సాహపరుస్తోంది“ అంటున్నాడు విజయ్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదే. క్రేజ్ మొదలైనప్పుడే.. ఇలా బ్రాండింగ్‌ల పేరుతో బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు విజయ్.