అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రమంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపిందని సమాచారం. ఆ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలతో చేతులు కలిపి స్పీకర్ నంబమ్ రెబియాని అభిశంసన చేసి పదవి నుండి తొలగించి అతని స్థానంలో డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న నోర్బూ తోంగ్ డొక్ ని స్పీకర్ గా ఎన్నుకొన్నారు. ఆ మరునాడు వారు అందరూ మరోసారి సమావేశమయ్యి ముఖ్యమంత్రి నమబం తూకిని కూడా పదవిలో నుండి తొలగించేరు. ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక స్థానిక స్టేడియంలో గత ఏడాది డిశంబర్ 16న అత్యవసర అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు గవర్నర్ జ్యోతీ ప్రసాద్ రాజ్ ఖోవ అనుమతించారు కూడా. మొత్తం 60మంది శాసనసభ్యులలో 27 మంది కలిసి ముఖ్యమంత్రిని, స్పీకర్ ని తొలగించడంతో రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడింది.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి గవర్నర్ సహకరించారని, కనుక తక్షణమే కలుగజేసుకొని పరిస్థితులు చక్కదిద్దాలని ముఖ్యమంత్రి నమబం తూకి ప్రధాని నరేంద్ర మోడికి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖలు వ్రాసారు. మాజి స్పీకర్ నంబమ్ రెబియా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. దానిని సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది కానీ దానిపై ఇంకా తీర్పు చెప్పలేదు.
ఈలోగానే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రప్రభుత్వం సిద్దమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ప్రణబ్ ముఖర్జీ ఈవిషయంలో కేంద్రప్రభుత్వ సలహాను పాటిస్తారా..లేదా వేచి చూడాలి. ఒకవేళ ఆయన తిరస్కరించినట్లయితే మోడీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవవచ్చును. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నమబం తూకి వ్రాసిన లేఖపై ఆయన స్పందించలేదు కనుక బహుశః మోడీ ప్రభుత్వ సలహా ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడానికి అంగీకరించవచ్చునని భావించవచ్చును.