నాని, శర్వానంద్, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, నిఖిల్, నాగశౌర్య, బెల్లంకొండ శ్రీనివాస్… ఇలా మనకంటూ ఓ యూత్ బ్యాచ్ ఉంది. ఎవరికి తగిన కథల్ని వాళ్లు ఎంచుకుంటున్నారు. కొత్త కొత్త కాన్సెప్టులు పట్టుకుంటున్నారు. విజయాలూ సాధిస్తున్నారు. మెల్లమెల్లగా మార్కెట్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లంతా టెన్షన్లో పడ్డారు. విజయ్ దేవరకొండ వల్ల.
పెళ్లిచూపులు కంప్లీట్‌గా దర్శకుడి సినిమా. అర్జున్ రెడ్డిలో పూర్తి స్థాయిలో విజయ్ మానియా కనిపించింది. అది గాలివాటం కాదని… విజయ్‌లో సిసలైన స్టార్ ఉన్నాడని ‘గీత గోవిందం’ నిరూపించింది. పైన చెప్పుకున్న హీరోలంతా పది సినిమాలు చేసినా దక్కించుకోలేనంత ఇమేజ్ మూడో సినిమాకే వచ్చేసింది. విజయ్‌కి వచ్చిన ఓపెనింగ్స్ చూస్తే దిమ్మతిరిగిపోవడం ఖాయం. పైగా విజయ్ టైమింగ్, యాటిట్యూడ్, తను పాత్రలోకి వెళ్తున్న విధానం, ఆ సినిమాని అభిమానుల్లోకి తీసుకెళ్తున్న పద్ధతి ఇవన్నీ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఎంతకాదన్నా.. విజయ్ మానియా ఇంకొన్నాళ్లు ఉంటుంది. విజయ్ లా నటించాలి, విజయ్ దారిలో కథల్ని ఎంచుకోవాలి, విజయ్‌లా ఎంటర్టైన్ చేయాలి… అని సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. ఇవన్నీ యూత్ హీరోల్లో టెన్షన్ పెట్టించే వ్యవహారాలు. ఏదో ఓ చిన్న కాన్సెప్టుని పట్టుకుని రెండు గంటల కాలక్షేపం చేయిద్దామంటే వీలయ్యే విషయం కాదు. అదిప్పుడు సరిపోని వ్యవహారం. విజయ్‌లా ఏదో స్ట్రైకింగ్లా చేయాలి. విజయ్‌లా దూసుకుపోవాలి. ఈ మానియా కొన్నాళ్లే. ఏ కొత్త హీరో వచ్చినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. కానీ.. దాన్నుంచి బయట పడడానికి కాస్త టైమ్ పడుతుంది.
‘గీత గోవిందం’ లాంటి హిట్టు కోసమో, ‘అర్జున్ రెడ్డి’లాంటి సంచలం కోసమో మిగిలిన హీరోలు ఆరాటపడే అవకాశం ఉంది. ఈ దశలోనే వాళ్లు తప్పులు చేసేస్తుంటారు. యువ దర్శకులు, స్టార్ డైరెక్టర్లూ.. విజయ్‌ని టార్గెట్ చేస్తూ కథలు రాసుకుంటారు. దాంతో… మిగిలిన హీరోలకు విజయ్ ఓ పెద్ద పోటీలా మారిపోతున్నాడు. ఆప్షన్లు ఎక్కువ ఉండడం మంచిదే. కథల ఎంపికలో మరింత జాగ్రత్త పడే ఛాన్సు ఉంటుంది. ఇన్నాళ్లూ టాలీవుడ్లో యూత్ హీరోలంటే.. నాని, శర్వానంద్‌ల పేర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు ముందు విజయ్ నుంచి ఆ వరుస మొదలవుతుంది. అంతే తేడా! రేపు మరో కొత్త హీరో వచ్చి విజృంభిస్తే… మళ్లీ లెక్కలు మారిపోతాయి. పరిశ్రమ ఓ సైకిల్ లాంటిది. ఇలా తిరుగుతూనే ఉంటుంది. కొత్త గాలి రావాలిగా మరి.