కేరళ వరదలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. అక్కడ అంత పెద్ద స్థాయిలో వరదలు ఎలా వచ్చాయన్న దగ్గర నుంచి… ఏ ఏ ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిందనేదాని వరకూ విస్తృతంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. కేంద్ర సాయం … ప్రజల ధైర్య సాహసాలు… వరదలు తగ్గిన తర్వాత ఏర్పడబోయే పరిస్థితులపైనా… రకరకాల కోణాల్లో విశ్లేషించుకుంటున్నారు. అంతా చూస్తూంటే.. ఒక్క కేరళలో మాత్రమే వరదలు వచ్చినట్లుగా ఉంది పరిస్థితి. నిజానికి కేరళ అంత తీవ్ర స్థాయిలో కాకపోయినా… ప్రమాదకర వరద.. తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఉంది.
తమిళనాడులోలోని కేరళ సరిహద్దు ప్రాంతాల్లో వరద పరిస్థితి భీకరంగా ఉంది. దాదాపుగా పదమూడు జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కేరళ- తమిళనాడు సరిహద్దుల్లో రహదారులన్నీ… తెగిపోయాయి. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కర్ణాటకలోనూ… పది జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కూర్గ్ తో పాటు.. ఆ చుట్టుపక్కల జిల్లాలన్నీ జల ముంపులో ఉన్నాయి. కావేరీ నదీ ఉప్పొంగి ప్రవహిస్తూండటంతో…. పెద్ద సంఖ్యలో ఊళ్లు నీట మునిగాయి. పన్నెండు మంది మృతి చెందినట్లు కర్ణాటక సర్కార్ చెబుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి రెండు రోజుల పాటు.. ఏరియల్ సర్వే నిర్వహించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
కేరళ వరదలపైనే అందరి ఫోకస్ ఉండటంతో… తమిళనాడు, కేరళల్లో వరదల సహాయచర్యల్ని ఆయా రాష్ట్రాలే కష్టనష్టాకోర్చి చేసుకుంటున్నాయి. కేరళకు… ఎంతో కొంత సాయం ప్రకటించిన కేంద్రం.. కనీసం తమ వైపు కూడా చూడటం లేదని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అసంతృప్తితో ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం.. కేంద్రం విషయంలో నోరెత్తే పరిస్థితి లేకపోవడంతో… బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి మాత్రం… నేరుగానే ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్నారు. కర్ణాటక వరదల విషయంలో మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. కేరళకే అంతంతమాత్రం సాయం చేస్తున్న కేంద్రం.. ఇక తమిళనాడు, కర్ణాటకలను ఏం పట్టించుకుంటుందన్న విమర్శలు జోరుగానే వినిపిస్తున్నాయి.